దేశంలోో ఎన్నికల వేడి మొదలైంది. ఈ తరుణంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంట గ్యాస్ ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందా అంటే అవుననే అంటోంది ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్! పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వంట గ్యాస్ ధర తగ్గింపు నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక వేత్తలు సమీరన్ చక్రవర్తి, బకార్ ఎం, జైదీ తెలిపారు. ఇటీవల టమాటాల ధరలు కూడా తగ్గిన నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగివచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం.. నిత్యావసర ధరలు తగ్గించేందుకు కేంద్రం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే గ్యాస్ ధర తగ్గించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి తోడు ఇంధన ధరలు కూడా తగ్గితే ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.