చిత్తూరు జిల్లాలో ఆలయం ఎద్దును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు కొందరు దుండగులు. పెనుమూరు మండలం కలికిరి కొండ ఆలయానికి చెందిన ఓ ఎద్దును అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా నిందితులను స్థానికులు పట్టుకున్నారు. కలికిరి కొండ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పశువులను మొక్కుబడిగా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో చిన్న కలికిరికి చెందిన ఓ వ్యక్తి సహకారంతో తమిళనాడు రాష్ట్ర పొన్నైకి చెందిన కొందరు వ్యక్తులు ఓ ఎద్దుకు మత్తుమందు ఇచ్చారు.
మత్తు మందు దెబ్బకు ఎద్దు పడిపోడంతో.. వెంటనే ఆటోలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న యల్లంపల్లె గ్రామస్థులు వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి ఎద్దును వారి దగ్గర నుంచి విడిపించి ఆటో, నిందితులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆలయానికి సమర్పించిన పశువులపై ఇలా కొందరు కన్నేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్ తమిళనాడు నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.
మరోవైపు పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడులో పెళ్లి ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయి. అడవికొడియంబేడుకు చెందిన రేఖ, శంకర్ దంపతుల కుమార్తె భావన వివాహం నిమిత్తం మంగళవారం రాత్రి ఇంటిల్లిపాది నాగలాపురంలోని కల్యాణ మండపంలో ఉన్నారు. ఈ సమయంలో వారి ఇంట్లో దొంగలు పడ్డారు.. ఇంటి తలుపులతో పాటు బీరువాను పగలగొట్టి ఐదు సవర్ల బంగారం, రూ.10 వేల నగదు అపహరించారు. వివాహానంతరం బుధవారం ఉదయం ఇంటికి వచ్చిన రేఖ చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.