రాష్ట్రంలో నిర్వహించిన మెడికల్ పీజీ కౌన్సెలింగ్ రద్దయ్యింది. ఇప్పటి వరకూ జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీటు పొందిన విద్యార్థులు ఎవరూ ఆయా కాలేజీల్లో చేరవద్దని పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది పీజీ సీట్లు పెరిగాయి. ఆయా కాలేజీల్లో సీట్లు పెంచుతూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నుంచి హెల్త్ వర్సిటీతోపాటు కాలేజీలకు లేఖలు వెళ్లాయి. ఎన్‌ఎంసీ నుంచి లేఖలు రావడంతో వర్సిటీ అధికారులు కూడా ఆయా కాలేజీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో సౌకర్యాలు బాగానే ఉన్నాయని నిర్థారించి కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యారు. ఎన్‌ఎంసీ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా సీట్ మ్యాట్రిక్ సిద్ధం చేసి, తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను వర్సిటీ పూర్తి చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో హెల్త్ వర్సిటీకి ఎన్‌ఎంసీ షాక్ ఇచ్చింది. ఎన్‌ఎంసీ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వర్సిటీ అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అనంతరం వర్సిటీ అధికారులు ఎన్‌ఎంసీని సంప్రదించగా రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లో తాము కేటాయించిన దాని కంటే అదనపు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్టు తెలిపారు.