పోలవరం ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని సాంకేతికంగా బలోపేతం చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నిశ్చయించింది. ఇందులో భాగంగా డయాఫ్రం వాల్, గైడ్‌బండ్, ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ అంశాలను తేల్చేందుకు సాంకేతిక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర జల వనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన నిర్మాణ సంస్థ డిజైన్లను రూపొందిస్తోంది. వీటిని కేంద్ర జలసంఘం పరిశీలించి.. సాంకేతిక సలహాలిస్తోంది. ఈ సలహాల మేరకు నిర్మాణ సంస్థ పనులు చేపడుతోందో లేదో కేంద్ర సంస్థలు పరిశీలించేలోగా.. లోపాలు తలెత్తితే సరిదిద్దేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో జలశక్తి శాఖ గడచిన మూడ్రోజులుగా ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్ష జరుపుతోంది.