కోడికత్తి కేసు నుంచి శ్రీనివాస్ కి విముక్తి కల్పించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. సీఎం జగన్ కోర్టుకు వస్తే తప్ప శ్రీనివాస్ కి విముక్తి ఉండదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ బెయిలుపై బయటకొస్తే జగన్ నాటకం బయట పడుతుందని సీఎంతోపాటు ఇతర కుట్రదారులు పన్నిన పన్నాగమే ఇదని విమర్శించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరుతో మాట్లాడారు. శ్రీనివాస్ ఏం పెద్ద నేరం చేశాడని 1,685 రోజులు జైల్లో ఉంచారని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి పొంది జగన్‌ను అధికార పీఠం ఎక్కించాలనే కుట్రలో సమిథైన శ్రీనివా్‌సకు సీఎం ఇచ్చే బహుమానం ఇదా? అని నిలదీశారు. ‘‘కోడికత్తితో జగన్ భుజంపై గుచ్చినందుకే ఏళ్ల తరబడి రిమాండ్‌లో ఉంచాలా..? గొడ్డళ్లతో తల నరికిన వాళ్లు మాత్రం వెంటనే బయటకు వస్తారు. ఇదెక్కడి న్యాయం? శ్రీనివాస్ దళితుడు కాబట్టే 1685 రోజులుగా జైల్లో ఉంటున్నాడు. మన దేశంలో దళితులకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదు’’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.