లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం నాటికి 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా అరకులోయ నియోజవర్గం నేతలు, కార్యకర్తలు హకుంపేట మండలం అడ్డుమండ నుంచి మండల కేంద్రం వరకు ఆరున్నర కిలోమీటర్ల మేర సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.... సీఎం జగన్మోహన్‌రెడ్డికి, వైసీపీ నాయకులకు గిరిజనులపై కపట ప్రేమతప్ప ఏ కోశానా అభిమానం లేదని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాల రిజర్వేషన్‌కు సంబంధించి జీవో నంబరు-3ను సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది రద్దు చేసిందని, దీనివల్ల గిరిజన యువతకు తీవ్ర అన్యాయంగా జరుగుతుందని, జీవో పునరుద్ధరణకు కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ముక్తకంఠంగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏజెన్సీలో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే దక్కే విధంగా జీవో నంబర్-3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అయన తెలిపారు.