రవాణాశాఖలో ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) కార్డుల మంజూరులో శుక్రవారం నుంచి డిజిటల్ విధానం అమలుకానుంది. ఇప్పటివరకూ ఎవరైనా కొత్తగా వాహనం రిజిస్ర్టేషన్ చేయించుకున్నా, డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నా చిప్‌తో కూడిన కార్డులు అందజేశారు. ప్రస్తుతం ఈ విధానానికి రవాణాశాఖ స్వస్తి చెప్పింది. ఇకపై చిప్‌కార్డులు ఇవ్వదు. వాటిస్థానంలో పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. వాహన తనిఖీ సమయంలో వాటిని చూపిస్తే సరిపోతుంది. ఈ మేరకు తాజాగా రవాణా శాఖ నిబంధనలు రూపొందించింది. గతంలో ఎవరెవరికి కార్డులు ఇవ్వాలో వారందరికీ ఈ నెలలోనే అందజేయనుంది. ఆర్‌సీ, డీఎల్ కార్డుల తయారీకి ఉపయోగించే చిప్‌లు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటితయారీ 2021 ఏప్రిల్ నెల నుంచి నిలిపివేసింది. జిల్లాలో సుమారు 20వేలకు పైగా వాహనదారులకు కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. వీరంతా కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. తనిఖీల సమయంలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని.. అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా జరిమానాలు విధించడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోనూ అత్యధికంగా వీటిపైనే ఫిర్యాదులు చేశారు. దీంతో కార్డుల జారీపై ప్రభుత్వం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పెండింగ్‌లో ఉన్నవాటిని త్వరగా అందజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో పెండింగ్ కార్డులన్నీ జారీచేసేలా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. సెప్టెంబరు నెల నుంచి డీఎల్, ఆర్‌సీ కార్డులను నెట్ సెంటర్లలో డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో ఉన్న పత్రాలను తనిఖీ అధికారులకు చూపిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లో మై పరివాహన్, డిజిలాకర్ యాప్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.