పెళ్లి వేడుకల్లో దుండుగులు కాల్పుల పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఆరుగురి గాయపడ్డారు. శనివారం రాత్రి కెనడా రాజధాని ఒట్టవాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్క పక్కనే రెండు వివాహాలు జరుగుతుండగా.. భారీగా అతిథులు హాజరయ్యారు. ఈ సమయంలో కాల్పులు జరగడం వల్ల అతిథులు భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ అంత గందరగోళంగా మారిందని నికో అనే యువకుడు తెలిపాడు. తన స్నేహితుడ్ని తీసుకెళ్లడానికి అక్కడకు తాను వచ్చిన సమయంలోనే కాల్పులు జరిగినట్టు చెప్పాడు.
‘ఒక్కసారిగా కాల్పులు జరగడం.. ఆపై అతిథుల అరుపులు, కేకలతో పెళ్లి వేదిక గంభీరంగా మారిపోయింది.. బహుశా 15-16 రౌండ్లు నాకు గుర్తున్నాయి.. ’ అని నికో వివరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఒట్టావాలోని సౌత్ ఎండ్ కన్వెన్షన్ హాల్ పార్కింగ్ స్థలంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో రెండు వేర్వేరు వివాహ రిసెప్షన్‌లు ఒకేసారి జరుగుతున్నాయి. వాహనాల్లో నుంచి దిగొద్దని. సంఘటనా స్థలం నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని పోలీసులు హెచ్చరించినట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ఈ ఘటనలో టొరంటాకు చెందిన 26, 29 ఏళ్ల యువకులు ఇద్దరు చనిపోయినట్లు ఒట్టావా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో అమెరికన్లు సహా ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. అయితే, వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఘటనకు దారితీసిన కారణాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు ఇన్‌స్పెక్టర్ మార్టిన్ గ్రోల్క్స్ చెప్పారు. దీని వెనుక జాతి లేదా మత విద్వేష చర్యల సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికీ ఆ దిశగా అనుమానం ఉందన్నారు.
కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎటువంటి అరెస్ట్‌లు జరగలేదు. తాజాగా మరణాలతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ కెనడా రాజధాని ఒట్టావాలో తుపాకి కాల్పులకు చనిపోయినవారి సంఖ్య 12కు చేరింది. ఇటీవల కొద్ది సంవత్సరాలుగా కెనడాలో తుపాకీ హింస పెరుగుతూ ఉంది. 2009తో పోల్చితే కాల్పుల ఘటనలు 81 శాతం మేర పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.