దొంగతనం చేసి దబాయించినట్లుగా చంద్రబాబు తీరుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. దోపిడీకి పాల్పడి తానేదో నిజాయతీపరుడిని అన్నట్లుగా చిత్రీకరించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దెప్పిపొడిచారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దొంగతనం చేసి దబాయించినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నాడా? లేదా? తేల్చాల్సింది వైసీపీ కాదని, ఐటీ శాఖ అన్నారు. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకుండా తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేయడం విడ్డూరమన్నారు. టీడీపీ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలకు గాను ఇప్పటికే ఈడీ ఆయనను విచారించి అరెస్ట్ చేయాల్సిందని, కానీ ఇంతకాలం చూస్తూ ఎందుకు ఊరుకుందో అర్థం కావడం లేదన్నారు. ముడుపులన్నీ చంద్రబాబు గూటికే చేరాయని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు. పాపం పండినప్పుడు అరెస్ట్ కావడం ఖాయమని, చంద్రబాబు తానేదో నిప్పులాంటి వ్యక్తిని అని చెబుతారని, కానీ ఆయన తుప్పులాంటి వ్యక్తి అన్నారు. తప్పుడు పునాదులపై ఎదిగారన్నారు. తాను చట్టానికి అతీతుడు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఇది బరితెగింపే అవుతుందన్నారు. ఐటీ నోటీసుల అంశంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆమె తీరులో మరిదిని రక్షించాలనే ఎత్తుగడ కనిపిస్తోందన్నారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి జగన్‌పై విమర్శలు చేయడమే ఎల్లో మీడియా విధానమన్నారు. తనకు ఇబ్బంది ఎదురైతే ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు నైజమన్నారు.