ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2005లో బుష్, పుతిన్ మధ్య చర్చ.. సంచలన నివేదిక

international |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 10:02 PM

పాకిస్థాన్ అణు కార్యక్రమాలపై అగ్రరాజ్యం అమెరికా , రష్యా అధినేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు తాజాగా జాతీయ భద్రతా ఆర్కైవ్ పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. 2001 నుంచి 2008 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ డబ్ల్యూ. బుష్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశాలు, ఫోన్ కాల్స్ లో ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాకిస్థాన్ అణ్వాయుధాలు, ఇరాన్ అణు కార్యక్రమంతో దానికున్న సంబంధాలు, ఏ.క్యూ. ఖాన్ అణువ్యాప్తి నెట్‌వర్క్ పాత్రపై ఇరువురు నేతలూ చర్చించుకున్నారు.


2005లో జరిగిన ఒక సమావేశంలో ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లలో పాక్ మూలాలున్న యురేనియం లభ్యమైనట్టు వచ్చిన వార్తలపై పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ అణు కార్యక్రమాల విషయంలో పశ్చిమ దేశాలు ఎందుకు చూసీచూడనట్టు వ్యవహరించాయన ఆయన ప్రశ్నించారు. ‘ఇరాన్ ల్యాబ్‌లో ఏముందో, అవి ఎక్కడున్నాయో స్పష్టంగా తెలియదు. పాకిస్థాన్‌తో సహకారం ఇంకా కొనసాగుతోంది’ అని పుతిన్ అన్నారు. దీనికి బుష్ స్పందిస్తూ.. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో తాను మాట్లాడానని సమాధానం ఇచ్చారు.


‘ఇరాన్, ఉత్తర కొరియాలకు అణు సాంకేతికత బదిలీ అవుతుందనే ఆందోళన గురించి ముషారఫ్‌తో చెప్పాను. వారు ఏ.క్యూ. ఖాన్‌ను, అతని సహచరులను జైల్లో పెట్టారు, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. వారు ఏం చెప్పారో తెలుసుకోవాలనుందని అడిగాను.. ముషారఫ్‌కు పదేపదే గుర్తుచేస్తూనే ఉన్నాను. ఆయన ఏమీ చెప్పడం లేదు, లేదా నిజం చెప్పడం లేదు’ అని బుష్ వివరించారు.


‘నాకు తెలిసినంతవరకు, సెంట్రిఫ్యూజ్‌లలో పాక్ మూలాలున్న యురేనియం దొరికింది’ అని పుతిన్ తన ఆందోళనను పునరుద్ఘాటించారు. ‘అవును, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ)కు చెప్పకుండా ఇరాన్ దాచిపెట్టిన పదార్థం అది. అది ఉల్లంఘనే’ అని బుష్ అంగీకరించారు. "అది పాక్ మూలాలున్నది. అది నన్ను కంగారు పెడుతోంది’ అని పుతిన్ అన్నారు. దానికి బుష్, "అది మమ్మల్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది’ అని బదులిచ్చారు.


2001లో స్లోవేనియాలో జరిగిన మరో సమావేశంలో, పాక్ అణు కార్యక్రమాలపై పుతిన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘నేను పాకిస్థాన్ గురించి ఆందోళన చెందుతున్నాను. అది అణు ఆయుధాలున్న ఒక సైనిక పాలన. అది ప్రజాస్వామ్యం కాదు, అయినా పశ్చిమ దేశాలు దానిని విమర్శించడం లేదు. దీని గురించి మాట్లాడాలి’ అని పుతిన్ అన్నారు.


ఈ పత్రాల ప్రకారం.. పాక్‌లో అంతర్గత రాజకీయ అస్థిరత, ముషారఫ్ నేతృత్వంలోని సైనిక పాలన, సున్నితమైన అణు సాంకేతికత అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదంపై ఇద్దరు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ.క్యూ. ఖాన్ నెట్‌వర్క్ గురించి చర్చలు పదేపదే వచ్చాయి. ఈ నెట్‌వర్క్ ఇరాన్, ఉత్తర కొరియా, లిబియాలకు అణు సాంకేతికతను సరఫరా చేసినట్లు తర్వాత నిర్ధారించారు.


తాజాగా బహిర్గతమైన పత్రాలు పాకిస్థాన్ అణు నియంత్రణ వ్యవస్థలు, దాని అణువ్యాప్తి కార్యకలాపాలపై అంతర్జాతీయంగా ఉన్న దీర్ఘకాలిక ఆందోళనలను నొక్కి చెబుతున్నాయి. ఇటీవల, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ రహస్యంగా అణు పరీక్షలు చేస్తోందని ఆరోపించిన నేపథ్యంలో భారత్ విమర్శలు గుప్పించింది.


ట్రంప్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ‘‘ఆ చర్యలు పాకిస్థాన్ చరిత్రకు అనుగుణంగా ఉన్నాయి’’ అని అన్నారు. ‘రహస్య, చట్టవిరుద్ధమైన అణు కార్యకలాపాలు పాకిస్థాన్ చరిత్రలో భాగం. దశాబ్దాల తరబడి అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏ.క్యూ. ఖాన్ నెట్‌వర్క్, మరిన్ని అణువ్యాప్తి కార్యకలాపాలు దీనికి నిదర్శనం’ అని ఆయన అన్నారు. ‘భారతదేశం ఎల్లప్పుడూ ఈ అంశాలపై అంతర్జాతీయ వేదికలపై ఏకరవు పెడుతూనే ఉంది’ అని జైస్వాల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa