టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియకుండా ఓ మాజీ ముఖ్యమంత్రిని జగన్ అరెస్ట్ చేయగలడా? అని ప్రశ్నించారు. "నేను చాలెంజ్ చేస్తున్నా... అమిత్ షాకు తెలియకుండా చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. జగన్ మోహన్ రెడ్డి... అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశాడు. ఇప్పుడు రాజకీయాలు ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. దీనివెనుక ఎవరున్నారో ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలి. బీజేపీ కాపాడుతుందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు. అమిత్ షా ఒక్క మాట అంటే చాలు జగన్ భయపడిపోతాడు. బీజేపీ హస్తం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. బీజేపీని, వైసీపీని దూరంగా పెడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదు" అని నారాయణ స్పష్టం చేశారు.