ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ వేదికగా ముగిసిన జీ20 సమావేశాలు,,,పాకిస్థాన్‌కు జీ20లో దక్కని చోటు

international |  Suryaa Desk  | Published : Sun, Sep 10, 2023, 09:10 PM

భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు ముగిసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే ప్రధాని సహా జీ20 సభ్యదేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రష్యా, చైనా అధినేతలు మాత్రం ఈ భేటీకి హాజరు కాలేదు. మన దేశంలో జరిగిన జీ20 సదస్సు గురించి అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా కవరేజీ లభించింది. పొరుగున ఉన్న పాకిస్థానీలు కూడా జీ20 సదస్సు గురించి ఆసక్తి కనబర్చారు. తమ దేశం జీ20లో సభ్యత్వం లేకపోవడం.. తమ దేశ ఆర్థిక పరిస్థితి పట్ల పాకిస్థానీలు నిర్వేదం వ్యక్తం చేశారు. తమ దేశానికి మెరుగైన నాయకత్వం అవసరమనే భావనను పాకిస్థానీలు వ్యక్తం చేస్తున్నారు.


అదే సమయంలో పాకిస్థాన్ జీ20 గ్రూప్‌లో సభ్య దేశం ఎందుకు లేదో తెలుసుకోవడానికి చాలా మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. అసలు జీ20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది ప్రపంచవ్యాప్తంగా 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో కూడిన గ్రూప్. ఇందులో 20 దేశాలతోపాటు యూరోపియన్ యూనియన్‌కు సభ్యత్వం ఉంది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌ను కూడా జీ20లో చేర్చారు.


1999లో ప్రపంచం ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జీ20ని ఏర్పాటు చేశారు. తొలి నాళ్లలో సభ్యదేశాల ఆర్థిక మంత్రులు మాత్రమే భేటీ అయ్యేవారు. కానీ 2008 ఆర్థిక సంక్షోభం తర్వాతి నుంచి ఈ దేశాల అధినేతలు భేటీలో పాల్గొంటున్నారు. అంతేకాదు ఏటా కనీసం ఓసారి సమావేశాలు కావాలని జీ20 సభ్యదేశాలు నిర్ణయించాయి. ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ శాంతి తదితర అంశాలపై జీ20 సదస్సులో సభ్యదేశాలు ప్రధానంగా చర్చిస్తాయి. ప్రపంచ జీడీపీలో దాదాపు 80 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం వాటా ఈ గ్రూప్ దేశాలది. మూడింట రెండొంతుల జనాభా, 60 శాతం భూభాగం ఈ దేశాలదే. దీన్ని బట్టే జీ20కి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. జనాభా పరంగా ఆ దేశం ప్రపంచంలో ఐదో పెద్ద దేశం. అణ్వాయుధాలు కలిగి ఉన్న అతి కొద్ది దేశాల్లో పాక్ ఒకటి. అయినప్పటికీ.. జీ20లో పాక్‌కు సభ్యత్వం లేదు. దీనికి ప్రధాన కారణం.. పాక్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం. 1999లో జీ20 ఏర్పడే నాటికి ఆ దేశం ఆర్థికపరంగా టాప్-20 దేశాల్లో ఒకటి కాదు. ఇప్పుడైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించింది.. ఆ దేశం సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆర్థికంగా అవరోధాలే కాదు.. రాజకీయ అస్థిరత, మానవ హక్కుల ఉల్లంఘన, ఉగ్రవాదం మొదలైన కారణాలతో జీ20 సదస్సుకు పాక్‌కు దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది.


ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పాకిస్థాన్ 42వ స్థానంలో ఉంంది. బంగ్లాదేశ్, వియత్నాం, నైజీరియా లాంటి దేశాలు కూడా ఆర్థికంగా పాకిస్థాన్ కంటే ముందున్నాయి. ప్రపంచ శాంతిలో పాకిస్థాన్ పాత్ర ఏంటో మిగతా దేశాలకు బాగా తెలుసు. ఈ కారణాలతో పాకిస్థాన్ జీ20లో చేరడం కుదర్లేదు. పాకిస్థాన్ జనాభాలో 60 శాతం యువతే. పాకిస్థాన్‌లో విలువైన ఖనిజాల వనరులు బోలెడన్ని ఉన్నాయి. పంటలు సమృద్ధిగా పండే భూములున్నాయి. వీటిన్నింటిని వినియోగించుకొని 2030 నాటికి 20వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని పాకిస్థాన్ గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఆ దేశం ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. టాప్-20 ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి పాకిస్థాన్‌కు చాలా సమయమే పట్టేలా ఉంది. ఎప్పుడైతే పాక్ ఆర్థికంగా టాప్-20లో నిలవగలదో అప్పుడు మాత్రమే జీ-20లోకి ఎంట్రీ ఇవ్వగలదు. అంత వరకూ జీ20లో భారత్‌ను అడ్డుకోవాలంటే.. చైనా, టర్కీల సాయాన్ని అభ్యర్థించాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com