భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతోన్న చైనాకు యూరోపియన్ దేశమైన ఇటలీ షాకిస్తామనేలా సంకేతాలిచ్చింది. నాలుగేళ్ల క్రితం చైనాతో బెల్ట్స్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ఒప్పందం కుదుర్చుకొని పశ్చిమ దేశాలను ఆశ్చర్యపరిచిన ఇటలీ.. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయనుంది. జీ20 సదస్సుకు హాజరైన చైనా ప్రీమియర్ లి ఖియాంగ్‌తో భేటీ సందర్భంగా ఇటలీ ప్రధాని జోర్జా మెలోనీ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భారత్ కీలకంగా వ్యవహరించనున్న ‘ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరోపియన్ యూనియన్ కారిడార్’లో ఇటలీ చేరబోతోంది. ఇండియా - మిడిల్ ఈస్ట్ - ఈయూ కారిడార్ అనేది రెండు వేర్వేరు కారిడార్లు. భారత్‌ను పశ్చిమాసియా దేశాలతో ఈస్ట్ కారిడార్ కలిపితే.. ఉత్తర కారిడార్ ఈ పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) దేశాలను యూరోప్‌తో కలుపుతుంది. ఈ కారిడార్ వల్ల భారత్ నుంచి నౌకలు, రైలు మార్గాల ద్వారా యూరప్‌కు సరుకు రవాణా తేలికవుతుంది. ఈ కారిడార్ వల్ల భారత్‌కు అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది.
బీఆర్ఐ నుంచి ఇటలీ వైదొలుగుతుందనే సంకేతాలు గత కొంత కాలం నుంచి వెలువడుతున్నాయి. అదే నిజమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటలీలోని చైనా రాయబారి ఇప్పటికే హెచ్చరించారు. దీంతో చైనాను నొప్పించకుండా.. తమ పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడం కోసం.. ఇటలీ ప్రధాని మెలోనీ స్వయంగా బీజింగ్ వెళ్లనున్నారు. చైనాలో 2013లో వన్ బెల్డ్ వన్ రోడ్ పేరిట బీఆర్ఐని ప్రారంభించింది. పురాతన సిల్క్ రోడ్ మార్గాన్ని పునరుద్ధరించడం కోసం.. ఆసియా, యూరప్ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడం కోసం బీఆర్ఐని చైనా తెరపైకి తెచ్చింది. ఇందుకోసం 150 దేశాలతో ఒప్పందం చేసుకుంది. కాగా చైనాతో బీఆర్ఐ అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఏకైక యూరోపియన్ దేశం, జీ7 సభ్య దేశం ఇటలీనే.
గతంలో పదేళ్ల వ్యవధిలోనే మూడుసార్లు ఆర్థిక మాంద్యం బారిన పడి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇటలీని చైనా తేలిగ్గానే తనవైపు తిప్పుకోగలిగింది. 2019లో చైనాతో ఇటలీ బీఆర్ఐ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా పెద్ద మార్కెట్ కావడంతో.. బీఆర్ఐలో భాగం కావడం ద్వారా ఆ దేశానికి ఎగుమతులను పెంచుకోవచ్చని.. పెట్టుబడులను ఆకర్షించొచ్చని ఇటలీ ఆశపడింది. కానీ చైనా చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని రోమ్‌కి ఈ నాలుగేళ్లలో తెలిసొచ్చింది. 2020 నుంచి 2022 వరకూ చైనా నుంచి ఇటలీకి ఎగుమతులు పెరిగాయి గానీ.. ఇటలీ నుంచి చైనాకు ఎగుమతులు మాత్రం పెరగలేదు. దీన్నే కారణంగా చూపించి బీఆర్ఐ నుంచి వైదొలగాలని ఇటలీ భావిస్తోంది.
చైనాతో బీఆర్ఐ ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల పశ్చిమ దేశాలు ఇటలీపై మండిపడ్డాయి. బీఆర్ఐ పుణ్యమా అని యూరోప్ దేశాలతోపాటు.. అమెరికాతో ఇటలీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి తలెత్తింది. దీంతో గత కొంత కాలంగా బీఆర్ఐ నుంచి బయటకొస్తామంటూ ఇటలీ లీకులిస్తోంది. ఇప్పుడు జీ20 సదస్సులో నేరుగా చైనా ప్రీమియర్‌కే ఇటలీ ప్రధాని సంకేతాలిచ్చారు.
ఇటలీ ప్రధాని మెలోనీకి మొదటి నుంచి చైనాతో బీఆర్ఐ ఒప్పందం కుదుర్చుకోవడం ఇష్టం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆమె ఇదే విషయం చెప్పారు. జీ7లోని మిగతా సభ్య దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయని ఆమె అప్పుడే వాదించారు. యూరోపియన్ యూనియన్, జీ7లోని మిగతా సభ్య దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇటలీ ప్రధాని మెలోనీ ప్రయత్నిస్తున్నారు. అందుకే రష్యా గతంలో తనకు మంచి మిత్రదేశమైనప్పటికీ.. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో.. రష్యాకు బదులు ఉక్రెయిన్‌కు అనుకూలంగా రోమ్ వ్యవహరిస్తోంది.
మరోవైపు యూరప్‌లో చైనీయులు ఎక్కువగా నివసిస్తోంది ఇటలీలోనే. యూరప్‌లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఇటలీ ఉపయోగపడుతుందని చైనా భావించింది. యూరప్ దేశాలను మెల్లగా తనవైపు తిప్పుకోవడానికి ఇటలీని మొదటి అడుగుగా చైనా భావించింది. కానీ ఇప్పుడు ఇటలీ ఇస్తోన్న సంకేతాలు డ్రాగన్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.