ప్రపంచంలో అత్యధికంగా షార్క్‌లు ఉన్న ప్రాంతం ఆస్ట్రేలియాలోని కోరల్ సముద్రం. ఈ క్రమంలో పర్యాటకులు పడవలో వెళ్తుండగా.. ఒక్కసారి వారిని చుట్టుముట్టాయి. తోకలు, ముందు భాగంతో దాడిచేస్తూ.. జెట్టీని ధ్వంసం చేశాయి. దీంతో ముందు భాగం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. కొద్ది సేపు ఆలస్యమైతే అందులోని ముగ్గురు వాటికి ఆహారమయ్యేవారు. కానీ, అదృష్టం బాగుండి.. ఎమర్జెన్సీ అలారమ్ మోగి.. నేవీ సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.
నడి సంద్రంలో పర్యాటకులు పడవపై షార్కులు దాడి చేయగా.. వాటి నుంచి ముగ్గురు సురక్షితంగా త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలోని కొరల్ సముద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గాలితో కూడిన కాటమరాన్‌లో (పడవ) వెళ్తోన్న ముగ్గురిపై సొరచేపలు అనేకసార్లు దాడి చేసినట్టు సీఎన్ఎన్ నివేదించింది. వీరిలో ఇద్దరు రష్యన్లు, ఒక ఫ్రెంచ్ జాతీయుడు ఉన్నారని.. వీరి వయసు 28 నుంచి 63 ఏళ్లలోపు ఉంటుందని తెలిపింది. పడవలో వనాటు నుంచి ఈశాన్య నగరమైన కెయిర్న్స్‌కు ప్రయాణిస్తున్నట్లు ఆస్ట్రేలియా మారిటైమ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో అత్యవసర హెచ్చరికలు రావడంతో తక్షణమే స్పందించామని, తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అనేక షార్కులు వారిని చుట్టుముట్టాయని పేర్కొంది. షార్కుల దాడికి పడవకు రెండువైపులా ఉన్న గోడలు ధ్వంసమయ్యాయని తెలిపింది. కాగా, రెస్క్యూ ఫోటోలు, వీడియోలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయి. పడవ దాదాపు మునిగిపోగా.. దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం పనామాకు చెందిన డుగోంగ్ ఏస్ నౌకను వినియోగించారు.
కైర్న్స్‌కు ఆగ్నేయంగా 835 కిలోమీటర్లు (520 మైళ్లు) దూరంలో రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించారు. పడవలో ఉన్న ముగ్గురు వ్యక్తులు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి అన్నా కోసిఖినా తెలిపారు. షార్కుల దాడి నుంచి బయటపడిన స్టానిస్లావ్ బెరియోజ్కిన్ అనే బాధితుడు మాట్లాడుతూ.. తమ పడవను సొరచేపలు తిమింగలమని తప్పుగా భావించి దాడిచేసినట్టు అనుమానిస్తున్నామని అన్నారు. పడవలపై షార్క్‌లు దాడికి అనేక కారణాలున్నాయని, ఈ ఘటన అస్పష్టంగా ఉందని ఆస్ట్రేలియా మారీటైమ్ సేఫ్టీ అథారిటీ రెస్పాన్స్ సెంటర్ యాక్టింగ్ మేనేజర్ జో జెల్లర్ అన్నారు. ‘ఎమర్జెన్సీ అలారమ్ వారి ప్రాణాలను కాపాడింది. ఇది రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్.. ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి, వారిని రక్షించడానికి అత్యంత సముచితమైన, వేగవంతమైన ప్రతిస్పందనను అందించడానికి వీలు కల్పించింది’ అని జెల్లర్ తెలిపారు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా కోరల్ సముద్రంలోనే సొరచేపలు ఉన్నాయి.