కక్షసాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఒక వర్గం మీడియా విషప్రచారం చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో యువకులను నైపుణ్య శిక్షణ ఇవ్వకుండా నేరుగా ప్రజల సొమ్మును సొంత ఖాతాల్లో జమ చేసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. యువత, రాష్ట్ర ప్రజలు అవినీతి జరిగిందా లేదా అనేది గమనించాలని కోరారు. అవినీతి చేసిన వ్యక్తి ఏ స్థాయి వాడైన శిక్షార్హుడే అన్నది గుర్తించాలన్నారు. దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ప్రభుత్వ ధనాన్ని తన సొంత ఖాతాలో వేసుకోవడం ఇదే ప్రప్రథమమని, వ్యవస్థల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని నేరుగా ప్రభుత్వ సొమ్మును కాజేయడం కంటే అతిపెద్ద స్కాం ఎక్కడా ఉండదన్నారు. సీమెన్స్ కంపెనీ వారు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా..? అని ప్రశ్నించారు. పేరు మాత్రం సీమెన్స్ కంపెనీది.. దాన్ని అడ్డుపెట్టి డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకొని డబ్బులు నేరుగా ఆ కంపెనీ నుంచి సింగపూర్, మలేసియాల్లో ఉన్నా షెల్ కంపెనీలకు బదలాయించి.. అక్కడి నుంచి నేరుగా డబ్బంతా చంద్రబాబు పీఏకి పంపించారన్నారు.