వైఎస్సార్ కడప జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఓ మహిళా ఉద్యోగినికి మూడు సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కడప జిల్లాకు చెందిన పిర్యాది ఈ.కిషోర్ కుమార్‌కు జీఎన్‌ఎన్‌ఎ్‌స స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం నుంచి తన భూమికి సంబంధించిన పరిహారం రావాల్సి ఉండేది. ఈ పరిహారానికి సంబంధించిన ప్రతిపాదనలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆమోదం కోసం ఆ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి ఎర్రంపల్లి ప్రమీల రూ.4వేలు ఇవ్వాలంటూ ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు ఫిర్యాదు కడప జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న మహిళా ఉద్యోగి ప్రమీలను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత కడప జిల్లా ఏసీబీ అధికారులు కేసును విచారించి చార్జ్‌షీటును కోర్టులో దాఖలు చేశారు. కోర్టులో నిందితురాలిపై నేరం రుజువు కావడంతో మూడు సంవత్సరాల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్ భగవాన్ వాదనలు వినిపించారు.