తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని హితవుపలికింది. ‘Oppose To Sanathana’ అనే అంశంపై విద్యార్థులను తమ అభిప్రాయాలు కోరుతూ ఓ విద్యా సంస్థ జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్. శేషసాయి.. సనాతన ధర్మం అంశం చుట్టూ జరుగుతోన్న చర్చపై ఆందోళన వ్యక్తం చేశారు.
‘అంటరానితనం అమానుషమైంది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలించినట్లు ప్రకటించినందున.. ఇక దేశంలో దానికి స్థానం లేదు. అలాగే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. కాకపోతే భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదు. మరీ ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
‘‘సనాతన ధర్మం అనేది నిరంతర విధుల సముదాయం.. ఇది హిందూ మతానికి లేదా హిందూ జీవన విధానాన్ని ఆచరించే వారికి సంబంధించిన బహుళ మూలాల నుంచి సేకరించింది.. దేశం పట్ల కర్తవ్యం, పాలకుల పట్ల కర్తవ్యం, రాజు తన ప్రజల పట్ల కర్తవ్యం, తల్లిదండ్రులు, గురువుల పట్ల కర్తవ్యం, పేదల సంరక్షణ, మొత్తం ఇతర విధులు’’ సనాతన ధర్మం అని అన్నారు. సనాతన ధర్మానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తీవ్రమైన చర్చ జరుగుతోందని, ఈ విషయంలో న్యాయస్థానం ఎటువంటి సహాయం చేయలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘‘ఆర్టికల్ 51A (a) ప్రకారం, రాజ్యాంగానికి కట్టుబడి.. దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించడం..’ అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. కాబట్టి రాజ్యాంగం ప్రకారం అంటరానితం నిషేధం... ఇది సనాతన ధర్మం లోపల లేదా వెలుపల ఉండకూడదు’’ అని వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఇళంగోవన్ తరపు లాయర్ వాదనలను కోర్టు ప్రస్తావిస్తూ.. సనాతన ధర్మం అంటరానితనాన్ని ఎక్కడా ఆమోదించలేదని లేదా ప్రోత్సహించదని.. హిందూమతాన్ని ఆచరించే వారందరినీ సమానంగా చూడాలని మాత్రమే నొక్కి వక్కాణించిందని పేర్కొంది.
‘మతపరమైన ఆచారాలు కాలానుగుణంగా మారుతున్నప్పుడు తెలియకుండానే చెడ్డ ఆచారాలు.. ప్రవేశించవచ్చు.. అవి తొలగించాల్సిన కలుపు మొక్కలు. కానీ పంటనే ఎందుకు పూర్తిగా కోసేయాలి?’ఇది సంక్షిప్తంగా న్యాయవాది వాదనల సారాంశం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలోని పౌరుడు తనకు ఇష్టమొచ్చిన మతాన్ని అనుసరించవచ్చని ఆర్టికల్ 25 చెబుతోందని న్యాయస్థానం స్పష్టం చేసింది.