జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కొకెర్‌నాగ్ ప్రాంతంలోని నాలుగు రోజులుగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ముష్కరుల కాల్పుల్లో కల్నల్, మేజర్, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన డీఎస్పీ సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. తాజాగా, ఉరి సెక్టార్‌లో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ చీనార్ కార్ప్స్ ట్విట్టర్‌లో వెల్లడించింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ముష్కరులను హతమార్చినట్టు తెలిపింది. హతమైన ఇద్దరు తీవ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.
అయితే మూడో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటుండగా.. సమీపంలోని పాకిస్థాన్ పోస్ట్ నుంచి భారత సైనికులపై కాల్పులు జరిగినట్లు చినార్ కార్ప్స్ తెలిపింది. ప్రస్తుతం ఉరి సెక్టార్‌లో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని చెప్పింది. మరోవైపు, పీర్ పంజాల్ పర్వతాలు ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి. గతంలో పాక్ సైన్యాలకు అడ్డగా ఉన్న ఈ పర్వతాల్లో లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రమూకలు నక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్ ఒక కల్నల్, మేజర్, కశ్మీరీ పోలీసు డీఎస్పీ, ఓ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సైనికుడు అమరుడైన విషయం తెలిసిందే. వాస్తవానికి మంగళవారం ఉగ్రవాదుల కదలికలు గురించి సమాచారం అందుకున్న రాష్టీయ్ర రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు.
అక్కడ నక్కిన ఉగ్రవాదుల్లో స్థానిక ఉగ్రవాది లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ ఉన్నాడని భావిస్తున్నారు. కానీ, రాత్రి సమయం కావడంతో ఆపరేషన్ కాస్త నెమ్మదించింది. దీంతో ఉగ్రవాదులు పీర్ పంజాల్ పర్వతశ్రేణుల్లోని పైభాగంలోని గుహకు చేరుకుని దాక్కున్నారు. బుధవారం ఉదయం వారి కోసం గాలింపు చేపట్టిన సమయంలో అధికారులను లక్ష్యంగా చేసుకొని ముష్కులు దాడి చేశారు. పర్వత గుహపైకి వెళ్లేందుకు ఇరుకైన ఒకే మార్గం ఉండటం ముష్కరులకు ఇది అనుకూలంగా మారింది. బలగాల భద్రతలో ఇది అత్యంత కీలకమైనదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్. డీఎస్పీ హుమయూన్ భట్‌ల ప్రాణాలను బలిగొన్నది ఈ మార్గం. గుహ నుంచి వీరిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో గఢాల్ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను వినియోగిస్తోంది. డ్రోన్ల సర్వే ఆధారంగా తీవ్రవాదులు నక్కిన ప్రాంతంపై సైన్యం మోర్టార్ షెల్స్‌తో దాడి చేస్తోంది.