పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో మరపురాని ఒక ఘట్టం. దాని కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూసేవారు ఉంటారు. అలాగే ఓ వ్యక్తి ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. తీరా పీటల మీద వరుడు, వధువు కూర్చున్న తర్వాత అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక.. వరుడి అన్నను వధువు పెళ్లి చేసుకుంది. చివరి నిమిషంలో వరుడు లేక ఆగిపోయిన పెళ్లిని అతని తమ్ముడిని కూర్చోబెట్టి కానిచ్చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తికి పెళ్లి జరుగుతోంది. అందరూ అతిథులు, బంధువులు పెళ్లి మండపానికి విచ్చేశారు. వధూవరులు కూడా పెళ్లి పీటల మీద కూర్చున్నారు. మరికొద్దిసేపట్లో వారి పెళ్లి జరగనుందనగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఓ చోరీ కేసులో ఆ పెళ్లి చేసుకుంటున్న ఫైజల్ నిందితుడు అని చెప్పారు. దీంతో వెంటనే పెళ్లి పీటల మీద ఉన్న ఫైజల్‌ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు అంతా కలిసి ఫైజల్‌ను తీసుకువెళ్లిన పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె ఒక్కతే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఫైజల్ అన్నను పెళ్లి చేసుకోవాలని ఆ వధువు నిర్ణయించుకుంది. దీంతో అదే ముహూర్తానికి అదే పెళ్లి మండపంలో ఫైజల్‌కు బదులు అతడి అన్నతో వివాహం జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడం గమనార్హం.
స్థానికంగా ఉండే ఓ వైన్ షాప్ క్యాంటీన్ నుంచి 35 పెట్టల మద్యం సీసాలతోపాటు ఆ దుకాణంలో ఉన్న కొన్ని ఇతర వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఆ వైన్ షాప్ క్యాంటీన్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపారు. చోరీ జరిగిన వైన్ షాప్ క్యాంటీన్‌లో ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన వస్తువులు, ఆధారాలతో దొంగతనానికి పాల్పడింది ఫైజల్ అని గుర్తించారు. వెంటనే ఫైజల్ ఆచూకీ పట్టుకుని అక్కడికి వెళ్లగా.. అతనికి పెళ్లి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి పీటల మీది నుంచే ఫైజల్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత విచారణలో తాను చేసిన నేరాన్ని చేసినట్లు ఫైజల్ ఒప్పుకున్నాడు.