సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఈ వివాదం ఇంకా ముగియక ముందే తాజాగా ఈసారి రామ్ చరిత్ మానస్‌పై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశంలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ మంత్రి గతంలో కూడా రామ్ చరిత్ మానస్ గురించి విద్వేష పూరితంగా మాట్లాడటం గమనార్హం. రామ్ చరిత్ మానస్‌ను ఉద్దేశించి సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తన సొంత కేబినేట్‌లోని మంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే సీఎం నితీశ్ కుమార్ చూస్తూ ఊరుకుంటున్నారని బీజేపీ మండిపడింది.
బిహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్.. తాజాగా రామ్ చరిత్ మానస్ గ్రంథాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. హిందూ మతంలో ఉన్న గ్రంథాల్లో కెల్లా రామ్ చరిత్ మానస్ సైనైడ్ లాంటిదని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాట్నాలోని ఓ విద్యా సంస్థలో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీ ముందు 55 రకాల వంటకాలను తీసుకొచ్చి పెట్టి.. అందులో పొటాషియం సైనైడ్‌ను కలిపి తినమంటే ఎలా ఉంటుంది.. ఆ ఫుడ్‌ను మీరు తింటారా అని ప్రశ్నించారు. హిందూ మతంలో ఉన్న గ్రంథాల్లో కూడా ఇలాంటి విషమే ఉంటుందని సంచలన కామెంట్లు చేశారు. బాబా నాగార్జున్, లోహియా వంటి చాలామంది రచయితలు ఈ గ్రంథాల్లోని కొన్ని విషయాలను వ్యతిరేకించారని ఈ సందర్భంగా చంద్రశేఖర్ గుర్తు చేశారు.
తనకు ఈ రామ్ చరిత్ మానస్‌పై ఉన్న ఈ అభిప్రాయం ఎప్పటికీ మారదని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఓ సందర్భంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రామ్ చరిత్ మానస్‍పై తాను లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నానని.. జీవితాంతం అదే అభిప్రాయంతో ఉంటానని స్పష్టం చేశారు. కుల వివక్షలో మార్పు రాకుంటే దేశంలో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ పదే పదే రామ్ చరిత్ మానస్‌పై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఈ విషయంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. రామ్‌చరిత్ మానస్‌పై చంద్రశేఖర్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే.. సీఎం నితీశ్ కుమార్‌కు వినిపించడం లేదా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. గతంలోనూ చంద్రశేఖర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మనుస్మృతి, రామ్ చరిత్ మానస్ లాంటి గ్రంథాలు సమాజాన్ని విడగొడతాయని గతంలోనూ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.
రామ్ చరిత్ మానస్‌ను పొటాషియం సైనేడ్‌తో బిహార్ మంత్రి చంద్రశేఖర్ పోల్చడంపై లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు. మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విభజన చిచ్చు రేపుతాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా శాఖ మంత్రిగా చంద్రశేఖర్ హయాంలో బిహార్‌లో ప్రాథమిక విద్య తీవ్ర దారుణ పరిస్థితుల్లో ఉందని ఆరోపించారు. విద్యార్ధులకు కనీసం బెంచ్‌లు లేవని.. మౌలిక వసతులు కూడా లేవని మండిపడ్డారు. అభివృద్ధి చేయకపోగా.. తిరిగి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ సమాజంలో చీలికకు దారితీస్తున్నారని చిరాగ్ పాశ్వాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.