జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు వెళ్లి ముగ్గురు సైనిక అధికారులు వీర మరణం పొందారు. ఈ క్రమంలో అమరుల భౌతిక కాయాలను వారి వారి స్వగ్రామాలకు తరలించారు. ఈ క్రమంలోనే కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామమైన పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు పంపించారు. దీంతో గ్రామస్థులు, బంధువులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా రోదనలతో నిండిపోయింది. వీటన్నింటి మధ్య హృదయాలను ద్రవింపజేసే సన్నివేశం చోటు చేసుకుంది. సైనికుల యూనిఫాం వేసుకున్న కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ కుమారుడు.. తండ్రి భౌతిక కాయానికి సెల్యూట్ చేసి జై హింద్ అంటూ నినాదాలు చేశాడు. ఆ దృశ్యాలు చూసిన ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు.
జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతిక కాయం ఆయన స్వగ్రామానికి చేరుకోగానే అది చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతిక కాయం చూసి ఆయన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అది చూసిన గ్రామస్థులు కూడా తీవ్ర కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఇందులో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి ఉండటం అక్కడ ప్రత్యేకంగా కనిపించింది. అసలు ఏం జరిగిందో తెలియని ఆ పసి వయసులో ఉన్న ఆ చిన్నారి తన తండ్రి భౌతిక కాయానికి సెల్యూట్ చేశాడు. అనంతరం జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. ఆ చిన్నారిని చూసి అతని చెల్లె రెండేళ్ల చిన్నారి కూడా తన అన్న ఏం చేస్తున్నాడో అలాగే చేసింది. ఈ సంఘటన అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది.
41 ఏళ్ల కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో వారు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ కూడా వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ భౌతిక కాయానికి హర్యానాలోని పానిపట్‌లోని అంత్యక్రియలు పూరత్ి చేశారు. ఇక జమ్ము కశ్మీర్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా భారీగా ప్రజలు తరలివచ్చారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ దిల్‌బాగ్ సింగ్ హాజరై నివాళులు అర్పించారు.