దిగ్గజ సంస్థ యాపిల్ తయారీ ఐ-ఫోన్ అమ్మకాలపై ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐ-ఫోన్ 12 అమ్మకాలను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించింది. రేడియేషన్ స్థాయిలు పరిమితికి మించి ఉన్నందున ఐ-ఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఫ్రెంచ్ సంస్థ ఏఎన్ఎఫ్ఆర్ యాపిల్ సంస్థను ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమ్మకాలను నిషేధిస్తూ ఇమ్యానుయేల్ మెక్రాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే, ఈ ఆరోపణలను యాపిల్ సంస్థ తీవ్రంగా ఖండించింది. తాము అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్లను తయారు చేస్తున్నామని పేర్కొంది.
ఇక, ఫ్రెంచ్ వాచ్‌డాగ్ నివేదిక ప్రకారం.. యాపిల్ ఐ-ఫోన్ 12 యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన రేడియేషన్ పరిమితులను ఉల్లంఘించింది. ఐ-ఫోన్ 12పై ఫ్రాన్స్ నిషేధం విధించడంతో పొరుగు దేశాలైన జర్మనీ, స్పెయిన్ కూడా విచారణ ప్రారంభించి, దాని విక్రయాలను నిలిపివేశాయి. తమ దేశంలో ఐ-ఫోన్ 12 విక్రయించడంలేదని నిర్దారించడానికి ఫ్రాన్స్‌లోని యాపిల్ స్టోర్‌లకు తమ అధికారులను తనిఖీలకు పంపుతున్నట్లు మెక్రాన్ ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ, ఐ-ఫోన్ 12ను అమ్మినట్టు గుర్తిస్తే సంబంధిత వినియోగదారులకు విక్రయించిన ఫోన్‌లను రీకాల్ చేస్తామని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు.
మరోవైపు, ఫ్రాన్స్ ఆరోపణలను యాపిల్ సంస్థ తోసిపుచ్చింది. ఐ-ఫోన్ 12ను 2020లో విడుదల చేసిన సందర్భంలో ఇది గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వివిధ అంతర్జాతీయ సంస్థలు ధ్రువీకరించినట్టు తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్ ఉందని.. ఇతర థర్డ్ పార్టీలు నిర్వహించిన అనేక ల్యాబ్ ఫలితాలను సమర్పించామని పేర్కొంది. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే అనర్ధాలను అవగాన చేసుకోవడానికి గత 20 సంవత్సరాలుగా పరిశోధకులు అనేక అధ్యయనాలు చేశారని పేర్కొంటూ నివేదికను జతచేసింది.
ఏది ఏమైనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మొబైల్ ఫోన్ల వల్ల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలు, ప్రమాదాలను గుర్తించలేదు. మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్ద కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ, దీనికి స్పష్టమైన సమాధానాలు మాత్రం లేవు. సెల్‌ఫోన్ ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడుపై దుష్ప్రభావం చూపుతుందని, పురుషులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయనీ, కేన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ.. రకరకాల అభిప్రాయాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, ప్రయోగాత్మకంగా ఇవి నిరూపితం కాలేదు. కానీ, మొబైల్ వల్ల కొంత రేడియేషన్ ముప్పు ఉంటుందని, దీనిని పూర్తిగా నియంత్రించలేని స్థితిలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.