ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో గెలిస్తే 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తా.. వివేక్ రామస్వామి ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2023, 11:17 PM

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రైమరీ డిబేట్లలో పాల్గొంటున్న వివేక్ రామస్వామి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెను సంచలనంగా మారాయి. ఎందుకంటే ఒకవేళ తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలోని ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 16 లక్షల మందిని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతానని ప్రకటించారు. దీంతోపాటు చాలా ప్రభుత్వ సంస్థలను మూసివేస్తానని వివేక్‌ రామస్వామి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.


రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్‌ రామస్వామి తాజాగా కీలక ప్రతిపాదనలు చేశారు. అమెరికాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో 75 శాతం మందిని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలగిస్తానని ఓ అమెరికన్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీటితోపాటు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్‌, టొబాకో, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అణు నియంత్రణ కమిషన్‌, ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌ - ఐఆర్‌ఎస్‌, కామర్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సహా వివిధ విభాగాల్లో సంస్కరణలు తీసుకువస్తానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు.


ప్రస్తుతం అమెరికాలో 22 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 ఏళ్లలో క్రమంగా ఇందులో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించారు. 22.5 లక్షల్లో 75 శాతం అంటే దాదాపు 16 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది లోపే 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో 30 శాతం మంది రానున్న ఐదేళ్లలో రిటైర్మెంట్ కానున్నారని వెల్లడించారు. అయితే 75 శాతం మంది లేదా 16 లక్షల మంది అంటే సంఖ్య పెద్దగా ఉన్నప్పటికీ.. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వివేక్ రామస్వామి తేల్చి చెప్పారు.


అయితే ఇలా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న నిర్ణయమని వివేక్ రామస్వామి వెల్లడించారు. దీని కోసం అధ్యక్ష సలహాదారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఉన్న సందేహాలు, అపోహలను తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. దేశాన్ని నడపడం అంటే ఓ కంపెనీని నడపడమేనని వ్యాఖ్యానించారు. కంపెనీ సీఈవోకు చెప్పకుండా హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్ ఎలాంవంటి నిబంధనలు రూపొందించదని.. అలాగే ఫెడరల్‌ ప్రభుత్వం కూడా ఇలాగే పనిచేస్తుందని చెప్పారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన రొనాల్డ్‌ రీగన్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ వరకు ఇలాంటి ఆలోచనలే చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు చూపించిన డొనాల్డ్‌ ట్రంప్‌కు తాను మద్దతు ఇస్తానని వివేక్‌ రామస్వామి వెల్లడించారు.


అయితే అమెరికా ఫెడరల్‌ విభాగంలో 16 లక్షల మంది ఉద్యోగులను తొలగిస్తే ప్రభుత్వ బడ్జెట్‌ వేల కోట్ల డాలర్లు ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల ప్రభుత్వంలోని కీలకమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెలువరించింది. ఇక ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో వివేక్‌ రామస్వామి చేసిన ప్రతిపాదనలు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న విషయాలు చెప్పి.. చాలా మంది నుంచి మద్దతును సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com