ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా ఎదిగిన చైనా.. నేవీ పరంగానూ విస్తరిస్తోంది. ఇప్పటికే 355 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద నేవీగా ఎదుగుతోన్న చైనా.. గత పదేళ్లలోనే 150 యుద్ధ నౌకలను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. డ్రాగన్ ఇదే రీతిలో యుద్ధ నౌకలను పెంచుకుంటూ పోతే.. మరో ఐదారేళ్లలో ఆ దేశం దగ్గర యుద్ధ నౌకల సంఖ్య 550 దాటుతుందని. విస్తరణ కాంక్షతో ఉన్న చైనా.. హిందూ మహాసముద్రంపై పట్టుకోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తో్ంది. భారత్ లక్ష్యంగా విదేశాల్లో నేవీ బేస్‌లను ఏర్పాటు చేస్తోంది. జిబౌటి, కరాచీ, గద్వార్‌లలో ఇప్పటికే బేస్‌లను ఏర్పాటు చేసిన చైనా.. కాంబోడియాలోని రీమ్‌లో బేస్ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది.
చైనా వ్యూహాత్మకంగా తన బలాన్ని పెంచుకుంటున్న తీరు గమనిస్తోన్న భారత్.. హిందూ మహాసముద్రంలో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పు నేపథ్యంలో తన నౌకాదళ బలాన్ని వేగంగా పెంచుకునే పనిలో పడింది. 2035 నాటికి భారత నౌకాదళంలోని యుద్ధనౌకల సంఖ్యను 175కు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల రూపాయల అంచనాతో 68 యుద్ధ నౌకలు, వెసెల్స్‌ను ఆర్డర్ చేసింది.
ఇప్పటికే భారత నేవీ వద్ద 132 యుద్ద నౌకలు, 143 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 130 హెలికాఫ్టర్‌లు ఉన్నాయి. మరో 8 నెక్స్ట్ జనరేషన్ కార్వెట్స్, 9 సబ్‌మెరైన్లు, 5 సర్వే వెసెల్స్‌తోపాటు రెండు మల్టీ పర్పస్ వెసెల్స్‌ను భారత్‌లో నిర్మించనున్నారు. మన షిప్‌యార్డ్‌లలో యుద్ధనౌకల నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. అదే సమయంలో పాత నౌకలను నేవీ నుంచి తప్పించాల్సి వస్తోంది. మరోవైపు బడ్జెట్ పరంగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారత్ దగ్గర 155-160 యుద్ధ నౌకలు మాత్రమే ఉంటాయి. 2035 నాటికి కుదిరితే యుద్ధ నౌకల సంఖ్యను 200కి పెంచుకోవాలని వీలుకాకపోతే కనీసం 175కి పెంచుకోవాలని తాము భావిస్తున్నామని భారత నౌకాదళ వర్గాలు తెలిపాయి.