విశాఖపట్నంలోని గాజువాకలో భారీ గణనాథుడు కొలువుదీరాడు. ఏకంగా 117 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అని నిర్వాకులు తెలిపారు. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న గాజువాకలోని నిర్వాహకులు.. ఈసారి రికార్డు స్థాయిలో ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ గణనాథుడుని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గాజువాక లంకా మైదానంలో ఎస్.వి. ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో కసిరెడ్డి గణేష్ సారథ్యంలో 117 అడుగుల వినాయకుడిని ప్రతిష్టించారు. ఈసారి శ్రీ అనంత పంచముఖ మహా గణపతిని రూపొందించారు.
తెలంగాణకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు కొత్తకొండ నగేష్ పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన 26 మంది కళాకారులు ఈ విగ్రహ రూపకల్పనలో పాల్పంచుకున్నారు. ఈ భారీ వినాయకుడి కోసం 120 అడుగుల ఎత్తు, 39 అడుగుల వెడల్పుతో మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీ కోసం పశ్చిమ బెంగాల్ నుంచి గంగానది మట్టిని తీసుకొచ్చారు. విగ్రహం తయారీలో చెరువు మట్టి, వెదురు, గడ్డిని ఉపయోగించారు. విగ్రహానికి ఓ వైపున 10 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పుతో అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపున సింహాద్రి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల తయారీకి 8 టన్నుల మట్టి, 5 టన్నుల వెదురు ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు.
117 అడుగుల ఈ భారీ గణనాథుడి కోసం 117 కిలోల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయించడం మరో విశేషం. ఖైరతాబాద్‌లో ఈసారి 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి సోమవారం (సెప్టెంబర్ 19) ఉదయం గాజువాక గణనాథుడి వద్ద తొలి పూజలు నిర్వహించారు. బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు, వైసీపీ కన్వీనర్ తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.