రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ తహతహలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. విపక్ష నేతలపై అక్రమ కేసులను బనాయిస్తూ, జైళ్లలో పెడుతూ అరాచకానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, దీని కోసం పోలీసులను జగన్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. నారా లోకేశ్ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ ఫీలర్లను వదిలి, విపక్షాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం ప్రశాంతమైన రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం జగన్ కు మంచిది కాదని అన్నారు. తమ అధికారం శాశ్వతం అని విర్రవీగిన హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిపోయారు... నీవెంత జగన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఫైళ్ల మీద సంతకాలు చేసేందుకు అధికారులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు.