స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు జీవోలు జారీచేసిన, నిధులు మంజూరు చేసిన అధికారులను ప్రశ్నించకుండా చంద్రబాబుపై కేసు ఎలా నమోదు చేస్తారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదని సీఐడీ చీఫ్ సంజయ్ చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే ఇది ఏర్పాటైంది. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే దీనికి నిదర్శనం. కార్పొరేషన్ ఏర్పాటులో ప్రధానమైన జీవో నెంబర్ 47ను అప్పటి ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని 2014 సెప్టెంబరు 10న ఇచ్చారు. తర్వాత ఆమె వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆమె పదవీకాలం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఆమెను ఏరికోరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. స్కిల్ కార్పొరేషన్ జీవోను ఇస్తూ ఆ కార్పొరేషన్‌కు సీఈవో, ఎండీలను కూడా నియమిస్తున్నట్లు ఆమె చెప్పారు. జాతీయ స్ధాయిలో ఏర్పాటైన తరహాలో రాష్ట్ర స్ధాయిలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని జీవోలో ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ జీవోతో కార్పొరేషన్ ఏర్పాటైతే దాని పుట్టుకే అక్రమమని సీఐడీ అధికారి ఎలా చెబుతారు?’’ అని పట్టాభి ప్రశ్నించారు. దీని తర్వాత ఇదే కార్పొరేషన్‌కు సంబంధించి మరో పదిహేను రోజుల్లో జీవో 48ని కూడా నీలం సాహ్ని విడుదల చేశారన్నారు. ఈ రెండు జీవోల్లో స్పష్టమైన సమాచారం ఉంటే సీఐడీ ఎందుకు వాటిని తొక్కిపట్టి ఉంచుతోందని నిలదీశారు. వీటిపై సాహ్నిని విచారించి ఉంటే ఆమె స్పష్టంగా అన్ని విషయాలు చెప్పేవారని పేర్కొన్నారు.