ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత రెచ్చిపోయారు. ఏకంగా తహసీల్దార్ చెంపై కొట్టడం వివాదాస్పదమైంది. లక్ష్మీనారాయణరెడ్డి మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై సంతనూతలపాడు మండల తహసీల్దారుగా వచ్చారు. మంగళవారం సాయంత్రం రెవెన్యూ కార్యాలయానికి వైఎస్సార్‌సీపీ నేత దుంపా చెంచిరెడ్డి వచ్చారు. తమ పనులు ఎందుకు చేయడం లేదంటూ తహసీల్దారుతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన చెంచిరెడ్డి ఆగ్రహంతో తహసీల్దారు గొంతు పట్టుకుని, చెంపపై కొట్టారు. లక్ష్మీనారాయణరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే ఈ ఘటనపై ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకు తహసీల్దార్ సమాచారం ఇచ్చారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని.. దౌర్జన్యాలు పెరిగిపోయాయని లక్ష్మీనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సంఘం ప్రతినిధులతో కలిసి కలెక్టర్ దినేష్‌కుమార్‌కు సంఘటన వివరాలు తెలియజేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నుంచి ఫిర్యాదు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంక్రిమెంట్ బిల్లు చేయలేదని మండల ఆర్‌ఐ ప్రసాద్ తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ పనులు చేయడం లేదని తనపై కక్ష కట్టినట్లు కలెక్టర్ దృష్టికి తహసీల్దార్ తీసుకొచ్చారు. చివరికి కలెక్టరేట్‌కు వెళ్లిన సంతనూతలపాడు ఎస్సై తహసీల్దార్‌తో మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. తహసీల్దార్ కూడా సెలవులపై వెళ్లి ఇటీవలే మళ్లీ విధుల్లో చేరారు.. ఇంతలో ఇలా దాడి జరిగింది.