ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్, కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కెనడాలో ఉన్న భారత పౌరులు, విద్యార్థులు, తాజాగా ఆ దేశానికి వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు చేసింది.
కెనడాలో భారత దేశాన్ని వ్యతిరేకించే కార్యక్రమాలు పెరుగుతున్నాయని.. రాజకీయ అండతో అవి మరింత విద్వేషపూరితంగా మారి నేరాలకు దారితీస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కెనడాలో నివసిస్తున్న భారతీయులు తాము ప్రయాణించే మార్గాలు, ప్రాంతాల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత్‌కు వ్యతిరేకంగా పోరాటాలు, హింసాత్మక సంఘటనలను వ్యతిరేకిస్తున్న భారత దేశ పౌరులను, మన రాయబారులే లక్ష్యంగా ఇటీవలి కాలంలో బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. అందువల్ల అలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రమంలోనే అక్కడి భారతీయులకు ధైర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కెనడాలోని భారత పౌరులను కాపాడేందుకు అక్కడి అధికారులతో భారత హై కమిషన్ ఎప్పటికప్పుడు చర్చలు, సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిపింది. ప్రస్తుతం భద్రతా పరంగా కెనడాలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులు, ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు చాలా జాగ్రత్త వహించాలని హితవు పలికింది. కెనడాలో ఉన్న భారత పౌరులు ఒట్టావాలోని హై కమిషన్ లేదా టొరంటో, వాంకోవర్ లలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే ఈ వివరాల ఆధారంగా వారిని సంప్రదించేందుకు వీలవుతుందని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెలువరించింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో భారత్, కెనడాల మధ్య వివాదం రాజుకుంది. ఈ ఏడాది జూన్ 18 వ తేదీన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు చీఫ్‌గా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులో తీవ్ర ఆరోపణలు చేయడం ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు చెడిపోవడానికి కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలోని భారత పౌరులు, భారతీయ సంస్థలపై దాడులు జరిగే అవకాశాలున్నట్లు అనుమానాలు మొదలు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అడ్వైజరీని జారీ చేసింది.