కేరళలో తాజాగా ప్రకటించిన లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది తిరుఓనమ్ పండగ సందర్భంగా నిర్వహించిన తిరుఓనమ్ బంపర్ లాటరీలో ఇంత భారీ మొత్తాన్ని ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. ఒక్క లాటరీతో ఆ వ్యక్తిని అదృష్టం వరించింది. కేరళ ప్రభుత్వ లాటరీ డిపార్ట్‌మెంట్ విక్రయించిన టికెట్‌ను కొనుక్కున్న ఆ వ్యక్తి లాటరీలో మొదటి బహుమతి గెలుచుకుని రూ.25 కోట్లను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది తిరుఓనమ్ పండగ సందర్భంగా తిరుఓనమ్ బంపర్ బీఆర్ 93 లాటరీలో మొత్తం 66 లక్షల టికెట్లను విక్రయించారు.
సాధారణంగా కేరళలో రెగ్యులర్‌గా లాటరీ టికెట్ల విక్రయాలు, లాటరీ లక్కీ డ్రాలు తీస్తూనే ఉంటారు. ఇక తిరుఓనమ్, విషు, క్రిస్మస్ వంటి పెద్ద పెద్ద పండగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ బంపర్ లాటరీ టికెట్లను విక్రయిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది తిరుఓనమ్ పండగ సందర్భంగా తిరుఓనమ్ బంపర్ బీఆర్ 93 పేరుతో టికెట్లను జారీ చేశారు. ఈ లక్కీ డ్రా లో మొదటి విజేతకు ఏకంగా రూ.25 కోట్ల బహుమతి దక్కింది. ఇందులోని రెండో విజేతకు రూ. కోటి, మూడో విజేతకు రూ.50 లక్షలు, నాలుగో విజేతకు రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు.
ఈ తిరుఓనం బంపర్ బీఆర్ 93 లాటరీకి సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారి లాటరీ టికెట్ సంఖ్యలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం వెల్లడించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో జరిగిన లాటరీ డ్రా కార్యక్రమంలో కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ 2023 కి సంబంధించిన బంపర్ లాటరీలో విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో టికెట్ నంబర్ TE 230662 మొదటి బహుమతి దక్కించుకుంది. ఈ టికెట్ గెలుచుకున్న వ్యక్తి రూ.25 కోట్లు తీసుకోనున్నారు.
ఇక ఇదే డ్రాలో మరో 20 మందికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒక్కొక్కరికి రూ.కోటి అందించనున్నారు. ఇక మూడో బహుమతి కింద 20 మందికి రూ.50 లక్షలు దక్కనున్నాయి. మరోవైపు.. నాలుగో బహుమతి కింద రూ.5 లక్షల చొప్పున 10 మంది అందుకోనున్నారు. ఇక ఈ ఏడాది విషు బంపర్ బీఆర్ 91 కింద నిర్వహించిన లాటరీలో VE 475588 నంబరు తొలి ప్రైజ్ దక్కించుకుంది. ఈ లాటరీ టికెట్ రూ. 12 కోట్లు దక్కించుకోనున్నారు. ఇక గతేడాది ఓనమ్ బంపర్ ప్రైజ్‌ల కింద 3,97,911 మంది వివిధ ప్రైజ్‌లు గెలుచుకున్నారు.