ఖలిస్థానీ సానుభూతిపరుడు హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు అప్పటికప్పుడు చేయలేదా? జీ20 సదస్సుకు ముందే మిత్ర దేశాలతో చర్చించారా? అంటే అవుననే అంటోంది అమెరికా మీడియా కథనం. జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ముందే కెనడా తన మిత్రదేశాలతో నిజ్జర్ హత్య విషయమై ట్రూడో సంప్రదింపులు జరిపిందని.. భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని వీరికి విజ్ఞప్తి చేసిందని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. అయితే, దీనిని లేవనెత్తడానికి అమెరికా సహా మిత్రదేశాలు విముఖత వ్యక్తం చేశాయని పేర్కొంది.
జీ20 శిఖరాగ్ర సదస్సు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కీలకమని భావించిన ఆయా దేశాలు దీనిపై బహిరంగ ప్రకటనకు వెనుకడగువేసినట్టు కథనం వెల్లడించారు. అంతేకాదు, ఇండో-పసిఫిక్‌లో తమకు కీలక భాగస్వామి భారత్‌తో బలమైన దౌత్య సంబంధాలను కోరుకుంటున్న అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లకు ఇది ఓ నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. ఫైవ్ ఐస్ (ఐదు కళ్లు) దేశాలుగా గుర్తింపు పొందిన అమెరికా, బ్రిటన్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలతో కెనడా ఈ సంప్రదింపులు జరిపినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.
హరదీప్ సింగ్ నిజ్జర్‌ను 2020లో ఉగ్రవాదిగా ప్రకఠించిన భారత ప్రభుత్వం.. అతడ్ని స్వదేశానికి రప్పించే చర్యల్లో భాగంగా కెనడాతో చర్చలు జరిపింది. ఇదే సమయంలో గతేడాది పంజాబ్‌లో సిర్సా డేరా పూజారి ప్రసాద్ శర్మ హత్యలో అతడి ప్రమేయం ఉందని కూడా ఆరోపించింది. ఈ క్రమంలో జూన్ 18న నిజ్జర్‌ను సర్రే నగరంలోని ఓ గురుద్వారా ఎదుట ఇద్దరు ఆగంతుకులు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందంటూ పార్లమెంటు వేదికగా కెనడా ప్రధాని ట్రూడో సంచలన ప్రకటన చేశారు. అనంతరం కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను కూడా బహిష్కరించారు. ఈ చర్యలపై భారత్ దీటుగా స్పందించింది. కెనడా ప్రధాని ప్రకటనను ఖండించిన భారత్.. ఈ ఆరోపణలు అసంబద్ధమైనవి, పసలేనివని కొట్టిపారేసింది. అంతేకాదు, ఖలీస్థానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న కెనడా వాటి నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడి చేసింది.
అనంతరం కెనడా దౌత్యవేత్తకు సమన్లు పంపిన విదేశాంగ శాఖ.. ఐదు రోజుల్లోపు తమ దేశం వీడాలంటూ హుకుం జారీ చేసింది. అయితే, కెనడా దౌత్యవేత్త భారత్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అనుమానంతోనే అతడిని న్యూఢిల్లీ బహిష్కరించిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఖలిస్థానీ వేర్పాటువాదులు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా వంటి భారత్ ఒత్తిడి తెస్తోందని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇటీవల లండన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ ఎంబసీలపై దాడి ఘటనలను ప్రస్తావించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రూడో మరోసారి స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే ఈ విషయంపై భారత్ దృష్టిసారించాలని కోరారు. భారత్‌తో భౌగోళిక రాజకీయ, వాణిజ్య భాగస్వామ్యాన్ని పశ్చిమ దేశాలు బలోపేతం చేసుకోడానికి ప్రయత్నిస్తోన్న తరుణంలో ఈ వివాదం రాజుకుంది. దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్‌మాన్.. కెనడాను మిత్రదేశంగా గుర్తిస్తూ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌తో తమ సంబంధానికి విలువనిస్తూ పశ్చిమ ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని ఎత్తి చూపారు. ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. G20 శిఖరాగ్ర సమావేశం సమయంలోనే ఉద్రిక్తత బయటపడింది. ట్రూడో ప్రస్తావించిన అంశాన్ని ప్రధాని మోదీ తిరస్కరించారు.