భారతీయ రైల్వేల్లో ప్రయాణించే చిన్న పిల్లలకు సంబంధించిన టికెట్ ధరల విషయంలో రైల్వే శాఖ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం.. భారీగా లాభాలను అందించింది. కేవలం ఏడు సంవత్సరాల్లోనే రూ.2800 కోట్ల ఆదాయం ఇండియన్ రైల్వేస్ ఖజనాలో వచ్చి చేరినట్లు స్వయంగా రైల్వే శాఖనే వెల్లడించింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా ఆదాయం వచ్చినట్లు చెప్పింది. చిన్న పిల్లలకు ఫుల్ టికెట్ తీసుకోవడం వల్ల రైల్వే శాఖకు వచ్చిన ఆదాయం ఎంతో చెప్పాలని తాజాగా దాఖలైన ఓ సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు రైల్వే శాఖ పరిధిలో ఉండే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వివరణ ఇచ్చింది.
చిన్న పిల్లల టికెట్ ధరలను సవరించి కొత్త నిబంధనలు తీసుకువచ్చి ఏడేళ్లు అయింది. ఈ కొత్త నిబంధనలతో గత ఏడేళ్లలో రైల్వే శాఖ రూ.2800 కోట్లు తన ఖజానాలో వేసుకుంది. ఇందులో గతేడాదిలోనే అత్యధికంగా రూ.560 కోట్లు వచ్చినట్లు రైల్వే శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిబంధన రాకముందు రైళ్లలో 5 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులకు సపరేట్ బెర్త్ ఎంచుకున్నా హాఫ్ టికెట్ ధరను మాత్రమే తీసుకునే వారు. అయితే ఈ విధానాన్ని సవరించిన రైల్వే శాఖ.. 2016 మార్చి 31 వ తేదీన కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. చిన్న పిల్లలకు వేరుగా బెర్తు గానీ సీటు గానీ తీసుకుంటే పెద్ద వారిలాగానే ఫుల్ టికెట్ డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ సెపరేట్ బెర్త్ గానీ సీటు గానీ వద్దు అని అనుకుంటే హాఫ్ టికెట్ డబ్బులు మాత్రమే చెల్సిస్తే సరిపోతుందని తెలిపింది.
ఈ కొత్త నిబంధనలు 2016 ఏప్రిల్ 21 వ తేదీ నుంచి రైల్వే శాఖ అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో 2016-17 నుంచి 2022-23 వరకు వేర్వేరు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వే శాఖకు ఎంత మొత్తం ఆదాయం సమకూరింది అని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు రైల్వే శాఖ తాజాగా సమాధానం ఇచ్చింది. ఈ ఏడేళ్లలో ఫుల్ టికెట్ డబ్బులు చెల్లించి సపరేట్ బెర్త్ గానీ సీట్ గానీ తీసుకుని 10 కోట్ల మంది చిన్న పిల్లలు ప్రయాణించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇక కేవలం 3.6 కోట్ల మంది చిన్న పిల్లలు మాత్రమే హఫ్ టికెట్ ధర చెల్లించి ప్రయాణించారని తెలిపింది. అంటే రైళ్లలో ప్రయాణించే చిన్నారుల్లో దాదాపు 70 శాతం మంది ఫుల్ టికెట్ చెల్లించే ప్రయాణిస్తున్నారని వెల్లడైంది. చాలా దూరం ప్రయాణం చేసే వారు సపరేట్ బెర్త్ వినియోగించుకుంటున్నారని.. ఈ కొత్త నిబంధన వల్ల రైల్వేకు అదనపు ఆదాయం సమకూరుతోందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.