ఉన్నత చదువులు భారత్ నుంచి చాలా మంది ఏటా అమెరికాకు ఎక్కువగా వెళ్తారు. ఆ తర్వాత స్థానంలో కెనడా ఉంటుంది. అక్కడి యూనివర్సిటీలు, వీసా ప్రక్రియ, విద్యార్థులకు విద్యా బోధన బాగుండటంతో చాలా మంది భారతీయులు కెనడాకు వెళ్తారు. ఇక కెనడాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య దౌత్య పరంగా టెన్షన్ వాతావరణం నెలకొనడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు భారత్, కెనడాల మధ్య బలమైన సంబంధాలు ఉండగా.. కెనడా ప్రధాని చేసిన సంచలన వ్యాఖ్యలతో అవి దెబ్బతిన్నాయి. దీంతో ఇప్పటికే కెనడాకు వెళ్లిన విద్యార్థులు, భారతీయులే కాకుండా వెళ్లడానికి సిద్ధమైన వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులకు విదేశాంగ శాఖ కొన్ని సూచనలు చేసింది.
ప్రస్తుతం కెనడాలో 3.19 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. అమెరికా తర్వాత కెనడాలోనే భారత విద్యార్థులు అధికంగా ఉన్నారు. రెండు దేశాల మధ్య దాదాపు 200 విద్యాసంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. కెనడాలో భారతీయ విద్యార్థులు, పంజాబ్ నుంచి వెళ్లి స్థిరపడినవారు భారీ సంఖ్యలో నివసిస్తారు. అక్కడి విద్యాసంస్థలు చాలా వరకు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడతాయి. కెనడాకు వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారత్ నుంచి వెళ్లిన వారే 40 శాతం మంది ఉంటారు. ప్రస్తుతం తలెత్తిన దౌత్య పరమైన వివాదం.. అక్కడికి వెళ్లి చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన విక్రమ్‌జిత్ సింగ్ అరోరా ఐలెట్స్ పరీక్షను గత నెలలోనే పాస్ అయ్యాడు. కెనడాలోని మంచి యూనివర్సిటీ కోసం వెతుకుతున్నానని భవిష్యత్‌లో చదువు పూర్తి చేసుకుని అక్కడే స్థిర పడాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కెనడా ఎంబసీ.. తన స్టూడెంట్ వీసాను రిజెక్ట్ చేస్తుందేమోనని భయపడుతున్నట్లు చెబుతున్నాడు.
భారత్ కెనడా ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన మరో విద్యార్థి అష్నూర్ కౌర్.. ఇరు దేశాలు ఇప్పటివరకు విద్యార్థులు, కెనడాలో నివసిస్తున్న భారతీయుల పట్ల ఎలాంటి ప్రకటన చేయలేదని.. అందువల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తన కన్సల్టెంట్ చెప్పినట్లు వివరించింది. జలంధర్‌లోని జుపిటర్ అకాడమీ యజమాని నర్పత్ బబ్బర్.. ప్రస్తుతం భారత్, కెనడా మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమేనని తెలిపారు. కెనడా వార్షిక బడ్జెట్‌లో 30 శాతాన్ని విదేశీ విద్యార్థుల నుంచే సేకరిస్తుందని పేర్కొన్నారు. ఏటా కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారత్ నుంచే ఉంటారని.. అంత భారీగా ఆదాయం వస్తుండటంతో కెనడా ఎలాంటి చర్యలు తీసుకోదని కన్సల్టెంట్ గుర్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.