చిత్తూరు జిల్లా, అంగళ్లు కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు. అంగళ్లులో ర్యాలీ నిర్వహణ కోసం పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నామని చంద్రబాబు తన పిటిషన్లో తెలిపారు. ర్యాలీ అంగళ్లు కూడలికి చేరుకోగానే అధికారపార్టీకి చెందినవారు తన కాన్వాయ్‌పై రాళ్లు వేశారని.. తమపైనే దాడి చేసి తిరిగి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని వెల్లడించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అదనపు అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరుకాలేకపోయారని.. విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. అయితే శుక్రవారానికి వాయిదా వేయాలని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అభ్యర్థించారు.