ఖలీస్థాన్ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతం భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధానికి ఆజ్యం పోసింది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు, తదనంతర పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఐక్యరాజ్యసమితి వేదికగా కెనడా ప్రధాని మరోసారి అదే ఆరోపణలు చేయడం గమనార్హం. గురువారం ఆయన ఐరాసలో కెనడా శాశ్వత మిషన్‌లో భాగంగా మాట్లాడుతూ.. తమ దేశం అంతర్జాతీయ నిబంధనలు, విధానాలకు కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఖలిస్థానీ నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై తన ఆరోపణలను పునరావృతం చేసిన ట్రూడో.. అందుకు విశ్వసనీయమైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
‘సోమవారం పార్లమెంట్‌లో నేను మాట్లాడినట్టుగా కెనడా గడ్డపై మా పౌరుడ్ని హత్య చేయడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని నమ్మడానికి విశ్వసనీయమైన కారణాలు ఉన్నాయి. అంటే, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రపంచంలోని ఒక దేశపు పాలనలో చట్టం ముఖ్యమైన పునాది.. ఇందుకు స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన ప్రక్రియలు ఉన్నాయి’ అని ట్రూడో వ్యాఖ్యానించారు. భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతల గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగిన ప్రశ్నకు ట్రూడో పై విధంగా సమాధానం ఇచ్చారు.
‘మేము ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరాం..ఈ అంశంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయాన్ని నిర్ధారించడానికి మాతో కలిసి పని చేయమని అడిగాం.. చట్టబద్ధమైన దేశంగా మేము మా పౌరుల భద్రత, మా విలువలను కాపాడుకోవడం కోసం అంతర్జాతీయ నిబంధనల అనుసరించే పనిని కొనసాగించబోతున్నాం.. ప్రస్తుతం మా దృష్టి దానిపైనే ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
‘మేము చట్టబద్ధమైన పాలన కోసం నిలబడతాం.. ఏ దేశమైనా తన స్వంత గడ్డపై తమ పౌరుడి హత్యలో పాల్గొనడం ఎంతవరకు ఆమోదయోగ్యం కాదని చెప్పదలచుకున్నాం’ అని జస్టిన్ ట్రూడో ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్న దేశంగా న్యాయ ప్రక్రియలు అత్యంత సమగ్రతతో తమను తాము ఆవిష్కరించుకోవడానికి అనుమతించడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను.. అయితే ఈ ఆరోపణలను పార్లమెంట్ వేదికగా చేయాలనే నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నాను.. వాటిని అంత తేలికగా చేయలేదు.. అత్యంత తీవ్రంగానే పరిగణించాను’ అని కెనడా ప్రధాని అన్నారు. కాగా, కెనడా ఆరోపణలపై గురువారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘అవును ఈ ఆరోపణలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధాని (మోదీ)తో లేవనెత్తారు.. ప్రధాని వాటిని తిరస్కరించారు’ అని పేర్కొంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చినప్పుడు జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ తిరస్కరించారని విదేశాంగ శాఖ వెల్లడించింది.