జాతీయ ఆరోగ్య సేవల(ఎన్‌హెచ్‌ఎ్‌స) చరిత్రలో.. కిడ్నీ మార్పిడి విజయవంతమై, జీవితాంతం ఔషధాలు వాడాల్సిన అవసరం లేని తొలి వ్యక్తిగా బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక అదితి శంకర్ రికార్డు నమోదు చేసింది. ఆమె చాలాకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. మూత్రపిండాల పనితీరు కూడా బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి(జీఓఎ్‌సహెచ్) వైద్యులు వినూత్నమైన ప్రయోగాన్ని చేశారు. తన తల్లి దివ్యకు చెందిన మూత్రపిండాన్ని అదితికి అమర్చే 6 నెలల ముందుగా, దివ్య ఎముక మజ్జ(బోన్ మేరో) నుంచి సేకరించిన స్టెమ్ కణాలను అదితి శరీరంలోకి ప్రవేశపెట్టారు. అనంతరం కిడ్నీ మార్పిడిని పూర్తి చేశారు. సాధారణంగా అవయవ మార్పిడి అనంతరం దాత అవయవాన్ని వ్యతిరేకిస్తూ సర్జరీ చేయించుకున్న వ్యక్తి శరీరపు రోగనిరోధక వ్యవస్థ ప్రతిఘటిస్తుంది. దాన్ని నిలువరించేందుకు గాను అవయవం పొందిన వ్యక్తి జీవితాంతం ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అయితే.. అదితి విషయంలో దాత నుంచి స్టెమ్ కణాలను మార్చి ముందుగానే శరీరాన్ని సంసిద్ధం చేసిన కారణంగా, ఆమె శరీరం తల్లి కిడ్నీని అంగీకరించిందని వైద్యులు వివరించారు. మున్ముందు మరెంతోమందికి ఈ విధానం ఉపకరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.