చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యోదయమైన నేపథ్యంలో అక్కడ నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కొలిపే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా ల్యాండర్, రోవర్‌లు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు వాటితో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు నిర్వహించగా.. శుక్రవారం సాయంత్రం వరకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ మాట్లాడుతూ.. ల్యాండర్, రోవర్ ఈ రోజు (శుక్రవారం) లేదా రేపు (శనివారం) మేల్కొనే అవకాశం ఉందని చెప్పారు.