ఎలుకలు చూడటానికి చిన్నగా ఉన్నా అవి చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. వాటిని పట్టేందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించేందుకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటిని పట్టుకుని తినేందుకు పిల్లుల్ని పెంచడం, ఎలుకల మందును తినే పదార్థాల్లో పెట్టి అవి తిరిగే చోట పెట్టడం, ర్యాట్ ప్యాడ్‌లు, ఎలుక బోనులు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటివి అనేకం చేస్తూ ఉంటాం. అయితే రైల్వే శాఖ మాత్రం ఒక్క రైల్వే డివిజన్‌లోనే ఎలుకలను పట్టుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ ఖర్చును చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే కేవలం ఎలుకలను పట్టుకునేందుకే రూ.69 లక్షల ఖర్చు అయినట్లు అధికారులు వెల్లడించారు. అది కూడా ఒకే ఒక్క డివిజన్‌లో.
ఉత్తర రైల్వే పరిధిలో మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. ఇందులో లక్నో డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఎలుకలను పట్టుకునేందుకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. అయితే ఈ 5 డివిజన్లలో ఎలుకలను పట్టుకునేందుకు రైల్వే శాఖ ఏకంగా రూ.69 లక్షలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసి మొత్తం 168 ఎలుకలను పట్టుకుంది. ఈ లెక్కన ఒక్కో ఎలుకను పట్టుకునేందుకు అయిన ఖర్చు అక్షరాల రూ.41 వేలు అని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే ఇవేమీ గాలి లెక్కలు కాదు.. సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్వయంగా రైల్వే శాఖనే గణాంకాలతో సహా వెల్లడించింది.
రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లో ఎలుకల కారణంగా మీరు కూడా ఏదో ఒక సమయంలో సమస్యలను ఎదుర్కొని ఉండాలి. ఈ అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంత కాలం క్రితం ఉత్తర రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లో సంచరిస్తున్న ఎలుకలను పట్టుకునేందుకు టెండర్లు జారీ చేసింది. అయితే, ఒక్క ఎలుకను పట్టడానికి రైల్వే శాఖ రూ.41,000 వరకు వెచ్చించింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని చూస్తే షాక్ అవుతారు. ఉత్తర రైల్వేలో మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. లక్నో డివిజన్‌లో ఎలుకను పట్టుకోవడంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు. స్టేషన్ లో సంచరిస్తున్న ఎలుకను పట్టుకునేందుకు రూ.69 లక్షలు వెచ్చించారు. అయినా కూడా మీరు ప్లాట్‌ఫారమ్ నుండి వెయిటింగ్ రూమ్ వరకు ఎలుకలను చూస్తారు. అయితే ఇంత ఖర్చు పెట్టినా ఎలుకల బాధ తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ ఖర్చుతో ఎలుకల నియంత్రణకు చర్యలు తీసుకున్నా ఎందుకు సమర్థవంతమైన ఫలితాలను రాబట్టడంలో రైల్వే శాఖ విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎలుకలను పట్టడంలో పెట్టిన ఖర్చులో తీవ్ర అవినీతి చోటు చేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే 2020 లోఉత్తర రైల్వేల పరిధిలోని ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్‌పూర్, మొరాదాబాద్ డివిజన్లలో ఈ ఎలుకలను పట్టుకునేందుకు టెండర్లు ఇచ్చింది. ఒక్క లక్నో డివిజన్‌లోనే ఎలుకలను పట్టుకునేందుకు రూ.23.2 లక్షలను రైల్వే శాఖ వెచ్చించింది. ఈ కాంట్రాక్ట్‌ను సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ దక్కించుకోగా.. ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. 2020 లో కేవలం 83 ఎలుకలను మాత్రమే పట్టుకున్న సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్.. 2021లో 45, 2022లో 40 ఎలుకలను పట్టుకుంది.