టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త కష్టం వచ్చి పడింది. చంద్రబాబు నాయుడ్ని అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గళం వినిపిస్తున్నారు. అందులో భాగంగా వేలాది మంది బాబుకు మద్దతుగా ఉత్తరాలు రాస్తున్నారు. ‘బాబుతో నేను’ పేరిట సెంట్రల్ జైలుకు నిత్యం వేలాది ఉత్తరాలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఓ ఉద్యమంలా మారింది.
సెప్టెంబర్ 18 నుంచి ఈ ఉత్తరాల ప్రవాహం మొదలైంది. 20వ తేదీన 2150 ఉత్తరాలు రాగా.. 21న 6250 ఉత్తరాలు వచ్చాయి. 22న 8340 ఉత్తరాలు రాగా.. శనివారం అత్యధికంగా 23,570 ఉత్తరాలొచ్చాయి. రిజిస్టర్డ్ పోస్టులు, స్పీడ్ పోస్టులు.. ఈ పోస్టు కార్డులకు అదనం కావడం గమనార్హం. ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడికి 50 వేల లేఖలు పంపించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. కాగా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఏపీ ప్రజలు 7 లక్షల లేఖలు రాశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లేఖలు చంద్రబాబుకు చేరకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి రాజమండ్రి దాన్వాయిపేటలోని పోస్టల్ ఆఫీసుకు వెళ్లి.. లేఖలకు సంబంధించిన వివరాలను తపాలా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 50 వేల లేఖలు మాత్రమే చంద్రబాబుకి చేరాయని.. మిగతా లేఖలు ఎక్కడని వారు అధికారులను ప్రశ్నించారు.
చంద్రబాబుకు భారీ ఎత్తున లేఖలు వస్తుండటంతో.. వాటిని తీసుకెళ్లేందుకు జైలు నుంచి ఓ అధికారి పోస్టాఫీసుకు వస్తున్నారని పోస్టల్ అధికారులు చెప్పినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. మిగతా లేఖలు మరో రెండు రోజుల్లో రాజమండ్రికి చేరకుంటాయని తపాలా అధికారులు టీడీపీ నేతలకు చెప్పారు. అంటే ఈ లేఖలన్నీ తీసుకెళ్లడం జైలు సిబ్బందికి తలకు మించిన భారం కానుంది.