చంద్రబాబు అరెస్ట్ పై ఏపీలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కుట్రలను ఎండగట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఇదిలావుంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధినేత అరెస్టు తదనంతర పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న, మద్దతుగా నిలిచిన వివిధ వర్గాలకు ఈ సందర్భంగా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం కొనసాగిస్తూనే మరోవైపు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కుట్రను తెలియజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే వారం యువగళం యాత్రను ప్రారంభించాలని లోకేశ్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో యువగళం యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాత్రను అక్కడి నుంచే మళ్లీ ప్రారంభించాలని లోకేశ్ భావిస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు విషయంలో న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే యువగళం యాత్రతో మళ్లీ రోడ్డెక్కాలని తాజా సమావేశంలో నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణయించినట్లు సమాచారం.