టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్న ఆయన సతీమణి భువనేశ్వరి ఆలయాల బాట పడ్డారు. దేవుళ్ల కటాక్షాలతో తన భర్త వీలైనంత త్వరగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రోజున రాజమండ్రిలోని లక్ష్మీగణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
తాజాగా కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయాన్ని భువనేశ్వరి సందర్శించారు. సోమవారం సత్యదేవుడి సన్నిధికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆమె వేదాశీర్వచనాలు అందజేశారు. ఆమె వెంట కుటుంబసభ్యులు, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. అలాగే నారా భువనేశ్వరి జగ్గంపేటలో పర్యటించారు.. టీడీపీ నేతల దీక్షకు సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు ప్రజల మనిషి అన్నారు భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని.. ఏం తప్పు చేశారని 17 రోజులుగా ఆయన్ను జైల్లో నిర్బంధించారని ప్రశ్నించారు. తన కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదని.. తానూ ఓ కంపెనీని నడుపుతున్నాను అన్నారు. అందులో 2 శాతం అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయని.. ప్రజల సొమ్ము తమకు అక్కర్లేదన్నారు. తమ కుటుంబమంతా ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తోందని.. ప్రజల కోసం తమ కుటుంబం ఎప్పుడూ ఉంటుంది అన్నారు. తమకు ఎలాంటి కోరికలు లేవని.. ఉన్నంతలో తృప్తి పడతామన్నారు.
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని జైల్లో నిర్బంధించారన్నారు. ప్రజల కోసం ఆయన జైలుకెళ్లారని.. స్కిల్ డెవలెప్‌మెంట్ సంస్థ వల్ల చాలా మంది ఉపాధి పొందారన్నారు. కొందరు సొంతంగా కంపెనీలు పెట్టుకుని సీఈవో స్థాయికి ఎదిగారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థను తీసుకురావడం తప్పా.. దీనిపై ప్రజలే ఆలోచించాలన్నారు. తమ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నానని.. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి వీసా, పాస్‌పోర్టు కావాలా అన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. ఎక్కడికైనా వెళ్లే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. శాంతియుతంగానే ర్యాలీ చేపడితే ప్రభుత్వం, పోలీసులు భయపడ్డారన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్‌తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వాల కంటే కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి సేవలు అందిస్తోందని గర్వంగా చెబుతున్నాను అన్నారు. ట్రస్ట్ ద్వారా 2వేల మంది అనాథ, పేద పిల్లలను ఉచితంగా చదివిస్తున్నామని.. చంద్రబాబుకు ప్రజలే ఊపిరి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తప్పించే వ్యక్తని.. రాళ్లు, రప్పల మధ్య హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టారన్నారు. ఇప్పుడు వేలాది కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని.. అది చంద్రబాబు ఆలోచన, ముందుచూపన్నారు.