తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం 6.55 నుంచి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి.
అనాది కాలం నుంచి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.
ఈ రథోత్సవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దాదాపు 2500 మంది సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్టు టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో ఆదివారం ఆరోగ్యశాఖాధికారి మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో 243 మందిని, గరుడసేవనాడు 774 మంది అదనంగా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు డాక్టర్ శ్రీదేవి . గరుడసేవనాడు మొత్తం 136 టన్నుల చెత్తను తొలగించామన్నారు. రథోత్సవం నాడు మాడ వీధుల్లో ఇసుకను తొలగించేందుకు అదనంగా 278 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు తాగునీటిని అందించేందుకు 230 తాగునీటి పాయింట్లు ఉన్నాయని, బ్రహ్మోత్సవాల్లో అదనంగా 187 పాయింట్లు ఏర్పాటు చేశామని వివరించారు.
గరుడ సేవ నాడు 681 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు తాగునీరు అందించినట్టు చెప్పారు. మాడవీధులు, ఇతర ప్రాంతాల్లో 3 రైడ్ ఆన్ యంత్రాలు, 12 జెట్ మెషిన్లు, ఒక గల్ఫర్‌తో పారిశుద్ధ్య చర్యలు చేపట్టామన్నారు. కర్నూలులోని రీజనల్ ప్రయోగశాల, తిరుమలలోని టీటీడీ ఆహార ప్రయోగశాల నిపుణులు తిరుమలలోని తాగునీరు, ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. హోటళ్లలో ఆహార నాణ్యతకు సంబంధించి భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్టు చెప్పారు. హోటళ్లలో ధరల పట్టికను ప్రదర్శించేలా సూచిస్తున్నామన్నారు.
భక్తులకు వైద్యసేవలందించేందుకు తిరుమలలో అశ్విని ఆసుపత్రితోపాటు ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల కోసం అదనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్విమ్స్, బర్డ్, రుయా ఆసుపత్రుల నుండి 40 మంది డాక్టర్లు, 35 మంది పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. భక్తుల కోసం 24 గంటల పాటు 13 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
గరుడ సేవ నాడు 4800 మందికి వైద్యసేవలందించామని, మాడవీధుల్లో బ్యాటరీ వాహనాల్లో దాదాపు 10 వేల మందికి మందులు పంపిణీ చేశామని తెలిపారు. చక్రస్నానం రోజు శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద వైద్యబృందంతోపాటు అంబులెన్సును అందుబాటులో ఉంచుతామని, నూతన పరకామణి భవనం వద్ద మరో అంబులెన్సు ఉంటుందని తెలిపారు.