ఏపీలో అంగన్వాడీలు ఆందోళనబాటపట్టారు. వేతనాల పెంపు సహా మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు, అధికారులు వేధింపులు తగ్గించాలనే డిమాండ్లతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా సరే అంగన్వాడీలు మారువేషాల్లో విజయవాడకు చేరుకున్నారు. కొంతమందిని విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విజయవాడలో అంగన్వాడీలకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది.
దాదాపు 200 మంది అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు స్థానిక రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని అజిత్ సింగ్ నగర్, ఢాబా కోట్ల రోడ్‌లోని గంగానమ్మ దేవాస్థాన కళ్యాణ మండపంలో నిర్బంధించారు. తమ గళం వినిపించేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ చలో విజయవాడను విజయవంతం చేస్తామన్నారు అంగన్వాడీలు . తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.
సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నాలుగేళ్లుగా హామీలు అమలు చేయకపోగా, బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అంగన్వాడీల అరెస్టులను వామపక్షాలు ఖండించాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్ర ప్రభుత్వం పాతరేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. సీఎం జగన్ ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండించాలన్నారు.