కృష్ణా జిల్లా శ్రీవల్లీ, దేవసేనా అమ్మవార్లకు హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఖరీదైన కానుకల్ని అందజేశారు. కడియాల బాల శేఖర్, శ్రీలక్ష్మి దంపతులు 79.900 గ్రాముల బరువు గల రూ.4.87 లక్షల విలువైన రెండు బంగారు హారాలు, రూ.48,500 విలువ గల 615 గ్రాముల రెండు వెండి పళ్లాలు కూడా స్వామికి సమర్పించారు. ఆలయ ఏసీ నల్లం సూర్యచక్రధరరావుకు వాటిని అందించారు.. అనంతరం దాతలకు రశీదు ఇచ్చారు. అంతకు ముందు దాతలు ఇచ్చిన వస్తువులను అమ్మవార్లు, స్వామి వద్ద ఉంచి కుంకుమార్చన చేశారు. అనంతరం దాత కుటుంబానికి స్వామి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం, శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదాలు అందించారు.
మరోవైపు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆదివారం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక రోజు ఆదాయం రూ.6.4 లక్షలు వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.మహన్యాస ఏక రుద్రాభిషేకాల్లో 149, శాంతి కల్యాణోత్సవం 57, కాలసర్ప, సుప్రభాత అర్చనలో 15 మంది, రాహు, కేతు దోష నివారణ పూజల్లో 166, సాధారణ అభిషేకాల్లో 189, పాల పొంగల్లు 168, శీఘ్ర దర్శనంలో 702, తలనీలాలు 548 మంది భక్తులు పాల్గొన్నారు. ఆర్జిత సేవా రుసుము ద్వారా రూ.4.13 లక్షలు.. శాశ్వత, నిత్య అన్నదాన పథకాలకు రూ.67 వేలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.02 వేల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.