తాడేపల్లిలోని ముఖ్యమమంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, సీఎం వైయస్.జగన్. మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇక మనం గేర్ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు. అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు అన్నారు. ఇన్నిరోజులు మనం బాగా చేశాం కదా, వచ్చే ఆరు నెలలు సరిగా పనిచేయకపోయినా పర్వాలేదు అనే భావన సరికాదు. వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు పడాలి. ఇంతకముందు నేను చెప్పాను. 175 కి 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? వైనాట్ 175. ఇది సాధ్యమే. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, ఇది సాధ్యం. క్షేత్రస్ధాయిలో మనం అంత బలంగా ఉన్నాం కాబట్టే.. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీచేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి అని తెలియజేసారు.