దేశం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విద్యావిధానాలను ప్రశంసిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం విద్యారంగంపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. విద్య అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే ఇవ్వాలని మేమంతా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ..సీఎం మాత్రం అందరికీ ఇద్దామని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏ స్కూల్‌లో చదివించాలన్నది తల్లిదండ్రుల విజ్ఞతకు వదిలేద్దామన్నారని తెలిపారు. మనం ప్రభుత్వం వైపు నుంచి స్కూళ్లను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చుదిద్దుదామని చెప్పారని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లను నాడు-నేడు ద్వారా రూపురేఖలు మార్చారని, అంతర్జాతీయ విద్యా విధానం అమలులోకి తీసుకువచ్చారన్నారు. సీఎం వైయస్ జగన్ సంస్కరణలు తీసుకువచ్చి పేదవాడికి విద్య చేరువ చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీలతో డిజిటల్ విద్యను మరింత చేరువ చేశారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు.