ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైట్‌హౌస్‌ను వణికిస్తున్న బైడెన్ పెంపుడు శునకం,,,సెక్యూరిటీ అధికారులను కరుస్తున్న కుక్క

international |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 10:47 PM

అమెరికా అధ్యక్షుడు అంటేనే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ నేత. అమెరికా అధ్యక్షుడి భద్రత అంటే ఎంత పకడ్బందీగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ భద్రతను చూసుకునే సెక్యూరిటీ సిబ్బంది.. కుక్కను చూసి భయపడుతున్నారు. అది ఎవరి కుక్కనో కాదు స్వయానా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు శునకం. పెంపుడు శునకాన్ని చూసి వైట్‌హాస్ సెక్యూరిటీ సిబ్బంది భయపడటం ఏంటి అనుకుంటున్నారా. అది ఎక్కడ కరుస్తుందోనని ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎందుకంటే అది కేవలం 3 నెలల్లోనే 10 మంది సెక్యూరిటీ అధికారులను కరిచింది. ఇప్పుడు ఈ విషయమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.


అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్‌లో జో బైడెన్ పెంపుడు శునకం కమాండర్ ఉంటుంది. ఇది జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన పెంపుడు కుక్క. అయితే ఈ కమాండర్ శునకం.. అగ్రరాజ్య అధినేతకు రక్షణ కల్పించే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు చుక్కలు చూపిస్తోంది. కేవలం 3 నెలల వ్యవధిలో 10 సార్లు సెక్యూరిటీ ఆఫీసర్లకు కాట్లు వేసిన కమాండర్.. ఇప్పుడు 11 వ సారి అదే పని చేసింది. సోమవారం రాత్రి 8 గంటలకు వైట్‌హౌస్‌లో డ్యూటీలో ఉన్న అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్‌ను కరిచింది. దీంతో వెంటనే స్పందించిన మిగితా అధికారులు.. అక్కడే ఆ ఆఫీసర్‌కు చికిత్స అందించినట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే వైట్‌హౌస్‌లో పనిచేసే సెక్యూరిటీ అధికారులపై దాడి చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదని పేర్కొన్నాయి. ఇది 11వ సారి అని తెలిపాయి.


సెక్యూరిటీ అధికారిని కమాండర్ శునకం కాటు వేయడంపై వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్‌పియర్ మీడియాకు వెల్లడించారు. వైట్‌హౌస్ అనేది ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవని తెలిపారు. అయితే అందులో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు అందులో ఉండే పెంపుడు జంతువులు ఒత్తిడికి లోనవుతాయని.. అలాంటి సమయంలో ఇలా ఎవరైనా కొత్తగా కనిపిస్తే దాడి చేస్తాయని కరీన్ జీన్‌పియర్ పేర్కొన్నారు. అయితే కుక్క కాటుకు గురైన సెక్యూరిటీ ఆఫీసర్‌తో కమాండర్‌కు అంతగా పరిచయం లేదని.. అతడు కొత్తగా అనిపించడంతోనే అది దాడి చేసి ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం కుక్క కాటుకు గురైన అధికారి ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.


జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన రెండేళ్ల వయసు ఉన్న కమాండర్‌ అనే పెంపుడు శునకం జో బైడెన్‌ వద్ద ఉంది. అయితే ఈ కమాండర్ శునకం 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య 3 నెలల్లోనే కనీసం 10 సార్లు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులను కరిచినట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ అధికారులు కమాండర్ శునకాన్ని చూస్తేనే వణికిపోయారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కమాండర్‌కు బైడెన్ కుటుంబ సభ్యులు జులై నుంచి శిక్షణ ఇస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారులు చెప్పారు. అయితే కమాండర్‌కు ముందు మేజర్‌ అనే శునకం బైడెన్‌ వద్ద ఉండేదని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. అది కూడా కొంతమంది సీక్రెట్‌ సర్వీస్‌ అధికారుల్ని.. వైట్‌హౌస్ సిబ్బందిని కరిచేది. దీంతో దాన్ని డెలావర్‌లో ఉండే తన ఫ్రెండ్స్ వద్దకు బైడెన్ పంపించారు. అయితే అమెరికా అధ్యక్షుని వద్ద విల్లో అనే పిల్లి కూడా ప్రస్తుతం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com