భారత్‌లో అక్టోబరు 1 నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు న్యూఢిల్లీలోని అఫ్గానిస్థాన్ (Afghanistan) రాయబార కార్యాలయం శనివారం రాత్రి ప్రకటించింది. తమ ప్రయోజనాల పట్ల భారత్ ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన సహకారం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.. ‘భారత్, అఫ్గన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అన్ని విధాలుగా ఆలోచించే భారత్‌లో మా దౌత్య కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాం.. ఇందుకు మేమెంతో చింతిస్తున్నాం’అని ప్రకటనలో పేర్కొంది.
అంతేకాదు, వివిధ కారణాలతో తమ రాయబార కార్యాలయంలో సిబ్బంది, ఇతర వనరులను భారత్ తగ్గించిందని తాలిబన్లు ఆరోపించారు. వనరుల లేమితో కార్యకలాపాలను కొనసాగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో మార్గం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధికారాన్ని భారత్‌కు అప్పగించే వరకు అఫ్గన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సమర్థవంతంగా దౌత్య కార్యకలాపాలను కొనసాగించగల సామర్థ్యాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ఎంబసీ మూసివేతకు అవే ప్రాథమిక కారణాలని పేర్కొంది.
‘భారత్‌లో దౌత్యపరమైన మద్దతు కొరవడటం.. అఫ్గన్‌లో చట్టబద్ధంగా పనిచేసే ప్రభుత్వం లేకపోవడం వల్ల తమ పౌరుల అవసరాలు, ఉత్తమ ప్రయోజనాలను అందించడంలో లోపాలను మేము గుర్తించాం’ అని పేర్కొంది. దౌత్యవేత్తలకు ఇతర కీలకమైన సహకార రంగాలకు వీసా పునరుద్ధరణ నుంచి సకాలంలో తగినంత మద్దతు లేకపోవడం మా బృందంలో నిరాశకు దారితీసింది.. సాధారణ విధులను సమర్థవంతంగా నిర్వహించే మా సామర్థ్యానికి ఆటంకం కలిగించింది’ అని ప్రకటన పేర్కొంది.
కాగా, ప్రస్తుతం భారత్‌లో అఫ్గన్ రాయబారిగా ఫరిద్ మముండ్జే వ్యవహరిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోడానికి ముందు అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ గని ఫరిద్‌ను నియమించారు. తాలిబన్ల ప్రభుత్వంలోనూ ఫరిద్ భారత్ రాయబారిగా కొనసాగుతున్నారు. భారత్‌లో అఫ్గాన్ రాయబార కార్యాలయంలో ట్రేడ్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోన్న ఖాదిర్ షా కొన్ని నెలల కిందట రాయబార కార్యాలయానికి తానే ఇంఛార్జ్‌ని అని భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆఫ్గాన్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇదే సమయంలో అఫ్గన్‌లో మహిళలపై ఆంక్షల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa