సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, తనకు సీఎం సీటు కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఓటమి ఖాయమని.. రాబోయేది తమ ప్రభుత్వమేనని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు. ‘జగన్ పరిస్థితి.. ఓడిపోయే ముందు హిట్లర్ పరిస్థితిలా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు.. 15 సీట్లు వస్తే చాలా గొప్ప’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం (అక్టోబర్ 1) ఆయన కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి యాత్రను ప్రారంభించారు. కిక్కిరిసిన అభిమానులు, జనసేన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
డబ్బు మీద గానీ, భూమి మీద గానీ తనకు ఎప్పుడూ కోరిక లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్యాకేజీ స్టార్ అంటూ తనను విమర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై మండిపడ్డారు. ‘జగన్ అద్భుతమైన పాలకుడైతే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదు. నా నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకున్నా. ఈ పదేళ్లలో మా పార్టీ అనేక దెబ్బలు తింది. ఆశయాలు, విలువల కోసం పార్టీ నడుపుతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మీ అందరి భవిష్యత్తు కోసమే నా తపన అంతా. నా పోరాటం సీఎం పదవి కోసం కాదు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పానని పవన్ పునరుద్ఘాటించారు. తనకు పార్టీల కంటే రాష్ట్రం బాగుండాలనేదే ముఖ్యమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి.. జనసేన -టీడీపీ వ్యాక్సినే మందు. మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారు. కులం కంటే మానవత్వం గొప్పది. నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదు, గుణమే చూశా. నేను ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభ, సామర్థ్యం మాత్రమే చూస్తా..’ అని పవన్ అన్నారు.
‘ఏపీ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్‌కు ఉరి వేసేశారు. సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే మనందరి లక్ష్యం అని పిలుపునిచ్చారు. మెగా డీఎస్‌సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘ఓ వైపు 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 2018 నుంచి డీఎస్‌సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు’ అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని ప్రకటించారు. పోలీసు ఉద్యోగుల కష్టనష్టాలు కూడా తనకు బాగా తెలుసునని పవన్ అన్నారు.
ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమేనంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం, మీరు కౌరవులు’ అని పవన్ అన్నారు. ‘జగన్ ముద్దూ మురిపాలతో పదేళ్లు జనంలో తిరిగారు. జగన్‌ను దేవుడని మొక్కితే, ఆయన దెయ్యమై ప్రజలను పీడిస్తున్నారు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. కృష్ణా జిల్లాలో 86 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, కృష్ణా జిల్లా ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. సరైన వ్యక్తులను గెలిపించుకోకుంటే ఒక తరం నష్టపోతుందని చెప్పారు.