డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నూతన జాతీయ విద్యా విధానంపై ఈ నెల 4, 5 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వర్సిటీలో సోమవారం సదస్సు నిర్వహణ వివరాలు వెల్లడించారు. సదస్సు నిర్వహణకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్), సమగ్ర సర్వ శిక్ష (అమరావతి), యూనియన్ బ్యాంకు ఆర్థిక సహకారంతో అందిస్తున్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు ఆంధ్రా, నాగార్జున, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలతో పాటు ఢిల్లీ, సిక్కిం, మధ్యప్రదేశ్, ఒడిసా, తెలంగాణా, మిజోరాం తదితర రాష్ట్రాలకు చెందిన వంద మంది విద్యా విభాగం నిపుణులు తమ పరిశోధనా పత్రాలను ఇప్పటికే వర్సిటీకి పంపించినట్టు చెప్పారు. వీరంతా పరిశోధనా పత్రాలను సదస్సులో ప్రదర్శిస్తారని, వీటిలో కొన్నింటిని ఎంపిక చేసి వర్సిటీ స్థాయిలో ఒక పుస్తకాన్ని తీసుకువస్తామన్నారు. ఈ సదస్సులో చర్చించిన అంశాల నివేదిక ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్‌సీటీఈలకు పంపిస్తామన్నారు. ఈ సదస్సుకు ఐసీఎస్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ వై.రమేష్, సర్వ శిక్ష ఎస్‌పీడీ శ్రీనివాసరావు, ఎన్‌సీటీఈ సభ్యులు గంటా రమేష్ ముఖ్యవక్తలుగా, విద్యా రంగ నిపుణులు ఎస్.పద్మనాభయ్య, వీఎన్ పండా, ఎస్.రామకృష్ణయ్య తదితరులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ హనుమంతు సుబ్రమణ్యం, కార్వ నిర్వాహక సభ్యులు నాగూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.